ఓటీటీ, వెబ్ సిరీస్… ఇప్పుడు ఈ పదాలు స్టార్ హీరోలు, హీరోయిన్స్ కు కూడా ఫేవరెట్స్ గా మారాయి. మరీ ముఖ్యంగా, సీనియర్ హీరోయిన్స్ కి పెద్ద తెరపైన కన్నా చిన్న తెరపైన డిజిటల్ మీడియాలో సత్తా ఉన్న పాత్రలు లభిస్తున్నాయి. అందుకే, ఈ మధ్య కాలంలో వరుసగా కాజల్, తమన్నా, సమంత… ఇలా చాలా మంది వెబ్ బాట పట్టారు. సిరీస్ లలో సీరియస్ క్యారెక్టర్స్ తో యాక్టింగ్ ప్రావెస్ ప్రదర్శిస్తున్నారు…
‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’లో సమంత నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో బోల్డ్ గా నటించిందనే చెప్పాలి. ఆమెపై తమిళనాడులో కొందరు భగ్గుమన్నారు కూడా. అయితే, మొత్తం మీద చూసుకుంటే సామ్ నటనకి ఓటీటీ ప్రేక్షకులు మంచి మార్కులు వేశారనే చెప్పాలి. దాంతో మిసెస్ అక్కినేని త్వరలో మరో వెబ్ సిరీస్ సైన్ చేస్తుందని పుకార్లు మొదలయ్యాయి. కానీ, అవన్నీ ఒట్టివేనంటున్నారు ఇండస్ట్రీ జనం.
‘ద ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ టూలో సమంత కనిపించటానికి ప్రధాన కారణం, షోని డైరెక్ట్ చేస్తోన్న రాజ్ అండ్ డీకే, ఆమెను చాలా రోజులుగా బతిమాలి ఒప్పించారట. అంతే కాదు, సామ్ బ్యాడ్ గాళ్ క్యారెక్టర్ లో కనిపించాలని ఎప్పట్నుంచో అనుకుంటోందట. ఆ కోరిక కూడా ‘ద ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ తో తీరిపోయింది. ప్రస్తుతం మిసెస్ చే ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడుపుతోంది. ఆపైన తమిళంలో విఘ్నశ్ శివన్ డైరెక్షన్ లో ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. తెలుగులో గుణశేఖర్ ‘శాకుంతలం’లో నటించాల్సి ఉంది. ఇంత బిజీగా ఉన్న సామ్ వెబ్ సిరీస్ లో మళ్లీ కనిపించే అవకాశం ఇప్పుడు ఎంత మాత్రం లేదట!
‘ద ఫ్యామిలీ మ్యాన్’ స్థాయిలో ఇంట్రస్టింగ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ తో మరో వెబ్ షో ఏదైనా వస్తే సమంత అందులో కనిపించే అవకాశాలు ఉన్నాయి. కానీ, దానికి చాలా టైం పడుతుందని పరిశ్రమ వర్గాల అంచన!