బాలీవుడ్‌లో పురాణకథలు ఆధారంగా సినిమాలు తీయడమంటే కేవలం సినీ ప్రయోగమే కాదు, ఒక భక్తి భావం తో కూడిన సాహస ప్రయత్నం అని చెప్పాలి. అలాంటి ఎన్నో ప్రయత్నాలలో ఓ ప్రత్యేక ప్రస్తావన కావలసిన చిత్రం – సల్మాన్ ఖాన్ ‘రామాయణ’. ఇప్పటి తరం ప్రేక్షకులకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ, 1990లలోనే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. సల్మాన్ ఖాన్ తన సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో రాముడి పాత్రలో నటించారు. అప్పట్లో ఈ సినిమా కోసం సల్మాన్ శిక్షణ కూడా తీసుకున్నాడు. విల్లు, బాణంతో ఫోటో షూట్ కూడా బయటకు వచ్చాయి. సీత పాత్రకు సోనాలీ బింద్రేను తీసుకోగా, పూజా భట్ కూడా ఓ కీలక పాత్రలో నటించాల్సి ఉంది. అయితే..
Also Read : Ajith : తృటిలో తప్పిన ప్రమాదం – రేస్‌కు దూరమైన అజిత్
అటు షూటింగ్ ప్రారంభించి దాదాపు 40 శాతం వరకు చిత్రీకరణ పూర్తి చేశారు. కానీ అప్పుడే ఓ అవాంఛనీయ మలుపు ఈ సినిమాను చీకటి చరిత్రగా మార్చింది. దర్శకుడు సోహైల్ ఖాన్, నటీమణి పూజా భట్‌ల మధ్య ఏర్పడిన ప్రేమ బంధం.. ఈ విషయం సొహైల్ తండ్రి సలీమ్ ఖాన్ వద్దకు చేరుకోవడం, ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడం – ఈ పరిణామాల వల్ల పూజా సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ సంఘటనలతో సినిమా పూర్తి కాలేదు. ఎంతో ఆశయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ అక్కడితోనే ఆగిపోయింది. సల్మాన్ ఎంత ప్రయత్నించినప్పటికీ ముందుకు సాగలేదు. ఇప్పుడు మరోసారి అదే కథను ఆధునిక టెక్నాలజీ, భారీ బడ్జెట్‌తో తెరపైకి తెచ్చేందుకు బాలీవుడ్ సిద్ధమవుతోంది.
స్టార్ దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న తాజా ‘రామాయణ’ సినిమా దేశవ్యాప్తంగా కాక ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. విఎఫ్‌ఎక్స్, మోషన్ క్యాప్చర్, గ్రాఫిక్స్ టెక్నాలజీలను వినియోగిస్తూ అత్యంత విజువల్ గ్రాండూర్‌తో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు దాదాపు రూ.4000 కోట్ల బడ్జెట్ కేటాయించడం చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను రెట్టింపు చేశాయి. ఈ సినిమాతో భారతీయ సాంస్కృతిక విలువలు, ఇతిహాసాలు ప్రపంచ సినిమాల మ్యాప్‌లో మరింత బలంగా నిలబడే అవకాశం ఉంది.
