Rayavalasa: అమెరికా ‘టైమ్స్ స్క్వేర్’ను ఊపేస్తున్న ఆంధ్రా జానపదం

Rayavalasaa

Rayavalasaa

 ఒక డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్ తీసిన చిన్న సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయి? మహా అయితే ఏపీ, తెలంగాణలో గట్టిగా ఈవెంట్స్ ప్లాన్ చేస్తారు. కానీ, అచ్చమైన ఆంధ్రా పల్లెటూరి మట్టివాసనను ఏకంగా అమెరికాలోని ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్’ బిల్‌బోర్డ్‌పై ప్రదర్శించి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది ‘రాయవలస’ చిత్ర బృందం. ఈ సినిమాలోని తొలి జానపద గీతం ‘రింగుడు రింగుడు’ విజువల్స్ టైమ్స్ స్క్వేర్ మీద ప్లే అవ్వడంతో ఇప్పుడందరి దృష్టి ఈ సినిమాపై పడింది. రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మాణంలో, మహిళా దర్శకురాలు రాధిక జయంతి ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో కార్తీక్ జయంతి హీరోగా ఎంట్రీ ఇస్తుండగా, శ్రీష నులు కథానాయికగా నటిస్తోంది.
అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన ఈ క్రేజ్‌ను మరింత పెంచుతూ.. తాజాగా మాస్ కా దాస్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘మా ఊరు రాయవలస’ పాటను మేకర్స్ గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ సాంగ్ ‘నాటు నాటు’ పాడిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన ఎనర్జిటిక్ వాయిస్‌తో ఈ పాటను పాడటం విశేషం. సాంగ్ లాంచ్ చేసిన అనంతరం విశ్వక్ సేన్ స్పందిస్తూ.. “రాయవలస కంటెంట్ చాలా బాగుంది. రాహుల్ ఈ పాటను అద్భుతంగా పాడాడు. చిత్ర బృందానికి నా ఆల్ ది బెస్ట్” అని ప్రశంసలు కురిపించారు.
మరోవైపు ఇప్పటికే నెట్టింట ట్రెండ్ అవుతున్న ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ‘రింగుడు రింగుడు’ పాటను గాయకులు ధనుంజయ్, సాహితీ చాగంటి ఆలపించగా.. ఏకంగా 1.2 మిలియన్లకు (12 లక్షలు) పైగా వ్యూస్‌తో చార్ట్ బస్టర్‌గా దూసుకుపోతోంది. అర్జున్ బాల సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుండగా, కిట్టు సినిమాటోగ్రఫీ విజువల్స్ పల్లెటూరి అందాలను అద్భుతంగా చూపించబోతున్నాయి. టాలెంటెడ్ టెక్నీషియన్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. రాఖీ ఈ సినిమాకు కథను అందించారు. అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్ వంటి సీనియర్ తారాగణం ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పల్లెటూరి స్వచ్ఛమైన వాతావరణం నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ బంధాలు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ చిత్రం రూపొందుతోంది. తొలి సినిమాకే ఏకంగా హాలీవుడ్ రేంజ్ ప్రమోషన్స్‌తో టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘రాయవలస’.. డిసెంబర్ 11న భారీ ఎత్తున థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.