NTV Telugu Site icon

Rakshith Atluri: సైకో సీన్ చూస్తూ ఆడియన్స్ ట్రాన్స్ లోకి వెళ్తారు: రక్షిత్ అట్లూరి ఇంటర్వ్యూ

Operation Raavan News

Operation Raavan News

Rakshith Atluri Interview for Operation Raavan Movie: పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి నటిస్తున్న “ఆపరేషన్ రావణ్” ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ధ్యాన్ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. “ఆపరేషన్ రావణ్” సినిమా గురించి తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు హీరో రక్షిత్ అట్లూరి

“ఆపరేషన్ రావణ్” మూవీ ఎలా మొదలైంది?
– కోవిడ్ టైమ్ లో “ఆపరేషన్ రావణ్” మూవీ ఆలోచన మొదలైంది. “పలాస” సినిమా తర్వాత మా సుధాస్ మీడియాలో ఎలాంటి సినిమా చేయాలని చర్చ మొదలైనప్పుడు ఇప్పుడు యంగ్ జనరేషన్ ఆడియన్స్ కు రీచ్ అయ్యేలా థ్రిల్లర్ మూవీ నిర్మిస్తే బాగుంటుందనిపించింది.

మీ నాన్నే డైరెక్టర్ కదా.. ఎలా అనిపించింది?
– నాన్నగారికి సినిమాల మీద ఉన్న ప్యాషన్ నాకు తెలుసు. పలాస టైమ్ నుంచి ఆయన కథా చర్చల్లో పాల్గొన్నారు. ఆ కాన్ఫిడెన్స్ తోనే ఈ మూవీ చేయాలనుకున్నాం. కథ అనుకున్న తర్వాత సెట్స్ మీదకు వెళ్లేందుకు కావాల్సినంత టైమ్ దొరికింది. అప్పుడు నేను నరకాసుర, శశివదనే రెండు సినిమాలు చేస్తున్నా. ఈ రెండు సినిమాలు కంప్లీట్ చేసేప్పటికి “ఆపరేషన్ రావణ్” కథను బాగా డెవలప్ చేసేంత టైమ్ దొరికింది. పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అయ్యాక సెట్స్ మీదకు వెళ్లాం.

నాన్నగారి డైరెక్షన్ గురించి చెప్పాలంటే?
– షూటింగ్ టైమ్ లో నాన్నగారి డైరెక్షన్ పట్ల నాతో పాటు రాధిక, చరణ్ రాజ్ లాంటి వాళ్లంతా హ్యాపీగా ఫీలయ్యారు. వాళ్లందరినీ సంతృప్తిపరచడం అంత సులువు కాదు. దర్శకుడిగా ప్రతిభ చూపిస్తేనే అది సాధ్యమవుతుంది. రాధిక గారు కూడా మా మూవీకి బాగా సపోర్ట్ చేశారు. సినిమా షూటింగ్ టైమ్ లో నాన్న నన్ను గైడ్ చేసేవారు. నేను ఆయనకు చెప్పేంత అవకాశం ఉండదు. ఆయన అన్నీ తెలుసుకునే దర్శకత్వంలోకి వచ్చారు. తండ్రి దర్శకత్వంలో నటించే అవకాశం ఎంతమంది పిల్లలకు వస్తుందో తెలియదు. ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారని అనుకుంటా. మా ఫాదర్ డైరెక్షన్ లో నటించడం సంతోషంగా ఉంది.

సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఏంటి?
– మా “ఆపరేషన్ రావణ్” సినిమాను ఎక్కువ మంది ఆడియన్స్ కు రీచ్ చేసేందుకు సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఇస్తున్నామని ప్రకటించాం. సినిమా చూసి ఫస్టాఫ్ లోగా సైకో ఎవరన్నది కనిపెట్టి మేము ఇచ్చిన నెంబర్ కు వాట్సాప్ పంపిస్తే వారికి సిల్వర్ కాయిన్ ఇవ్వబోతున్నాం. విజయవాడ, వైజాగ్ వంటి నగరాల్లో నా చేతుల మీదుగా ఈ కాయిన్ ఇస్తాను. కొందరు చెప్పినట్లు ఊరికే చెప్పడం కాదు. వెయ్యి సిల్వర్ కాయిన్స్ చేయించి పెట్టాం.

“ఆపరేషన్ రావణ్” సినిమాలో సందేశం ఏంటి?
– “ఆపరేషన్ రావణ్” సినిమాలో సందేశం ఏమీ ఉండదు. ఈ సినిమాలో సైకో చిన్నప్పటినుంచి అలా ఉండడు. కొన్ని పరిస్థితుల వల్ల అలా అవుతాడు. మనలో ఆలోచనల అంతర్యుద్ధాన్ని ఇప్పటిదాకా ఎవరూ స్క్రీన్ మీద చూపించలేదు. మా సినిమాలో అలాంటి ప్రయత్నం చేశాం. ఆ సీన్ థియేటర్ లో బాగా ఎంజాయ్ చేస్తారని నమ్మకం ఉంది. నిన్ననే మళ్లీ సినిమా చూశాను. సైకో తన ఆలోచనలను విజువలైజ్ చేసే సీన్ చూస్తూ ఆడియెన్స్ ట్రాన్స్ లోకి వెళ్తారు.