NTV Telugu Site icon

లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు… పీవీపీ సెన్సేషనల్ కామెంట్స్

PVP Takes a dig at film heroes who charge crores

‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు’ అంటూ పివిపి సినిమా అధినేత, ప్రముఖ నిర్మాత, వ్యాపార వేత్త ప్రసాద్ వి పొట్లూరి తాజాగా చేసిన సెన్సేషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… రైల్వే పాయింట్‌మ్యాన్ మయూర్ షెల్కే పేరు గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఏప్రిల్ 17న ముంబై సమీపంలోని వంగని స్టేషన్ వద్ద రైలు వస్తుండగానే పట్టాలపై పడిపోయిన ఆరేళ్ళ బాలుడు సాహిల్ షిర్సాత్ ను కాపాడాడు మయూర్. తన ప్రాణాలను పణంగా పెట్టి మయూర్ చేసిన సాహసానికి దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. సీసీటీవీ కెమెరాలో రికార్డు అయిన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైల్వే మంత్రి పియూష్ గోయల్ మయూర్ కు రూ.50 కే అవార్డును ప్రకటించగా… మయూర్ తాను కాపాడిన బాలుడు సాహిల్ షిర్సాత్ కు రూ.25 వేలు విరాళంగా ఇస్తానని ప్రకటించాడు. సాహిల్ తల్లి దృష్టి లోపంతో బాధపడుతోందని, వారిది పేద కుటుంబమని, అందుకే ఆ బాలుడి భవిష్యత్ కోసం సగం డబ్బును విరాళంగా ఇవ్వాలని అనుకుంటున్నట్లు మయూర్ పేర్కొన్నాడు.

అయితే తాజాగా ప్రముఖ చలన చిత్ర నిర్మాత, వ్యవస్థాపకుడు ప్రసాద్ వి పొట్లూరి సోషల్ మీడియాలో మయూర్ షెల్కే ధైర్య సాహసాలను కొనియాడారు. అయితే మయూర్ ను ప్రశంసిస్తూ ‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు’ అంటూ పీవీపీ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘రియల్ హీరో బాబు, రీల్ హీరో కాదు… లంగా డాన్సులేసే సార్లకు 50 కోట్లు, ఈ రియల్ హీరోకి జస్ట్ జావా బైక్.. హతవిధి! మనం చేసే కొంచమైనా… కొట్టే సీటీమార్ లైనా ఇలాంటి సూపర్ హీరోస్ కి కొడదాం బ్రదర్స్’ అంటూ పీవీపీ ట్వీట్ చేశారు.

కాగా మయూర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 2016 లో రైల్వేలో పాయింట్స్‌మన్‌గా చేరాడు. తాజాగా అతని వెలుగులోకి వచ్చిన ధైర్యసాహసాలను మెచ్చిన ఒక కార్పొరేట్ సంస్థ అతనికి బైక్ ను బహుమతిగా ఇచ్చింది. మరికొంతమంది వ్యక్తులు, ఎన్జిఓలు కూడా అతనికి నగదు పురస్కారాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. కాని అతను డబ్బును ఆ నిరాకరించాడు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా ప్రజలు భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అందువల్ల అవసరమైన రోగుల చికిత్స కోసం ఆ డబ్బు ఇవ్వమని మయూర్ వారిని రిక్వెస్ట్ చేశాడు.