Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. ‘అనకాపల్లి’ నిర్మాత ఆవేదన!

Anakapalli Producer Kandregula Naidu

Anakapalli Producer Kandregula Naidu

Anakapalli Movie Producer Kandregula Naidu Comments: తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాలకు ఎదురవుతున్న థియేటర్ల సమస్య మరోసారి చర్చనీయాంశంగా మారింది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నప్పటికీ.. సరైన షో టైమింగ్స్ ఇవ్వడం లేదంటూ నిర్మాత కండ్రేగుల నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర భాషల చిత్రాలకు, పెద్ద సినిమాలకు ప్రాధాన్యం ఇస్తూ.. స్థానిక చిన్న సినిమాలకు అన్యాయం చేస్తున్నారంటూ నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

విక్రమ్‌ సహిదేవ్‌, సంధ్యా వశిష్ట హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్‌ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాను కండ్రేగుల నాయుడు, దర్శకుడు త్రినాథ రావు నక్కిన సంయుక్తంగా నిర్మించారు. గ్రామీణ నేపథ్యంలో లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న రిలీజ్ అయింది. ఈరోజు థాంక్స్ మీట్‌లో పాల్గొన్న నిర్మాత నాయుడు.. సినిమా విడుదల, థియేటర్ల కేటాయింపుపై మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరుకు తమ సినిమాకు 200 థియేటర్లు కేటాయించినట్లు చెబుతున్నప్పటికీ.. వాస్తవంగా చూస్తే అందులో సరైన షో టైమింగ్స్ లేవని అన్నారు. అర్ధరాత్రి సమయాల్లో షోలు కేటాయించడం వల్ల సినిమాకు ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు.

‘ఏపీ, తెలంగాణాలో అనకాపల్లి సినిమాకి 200 థియేటర్లు ఇచ్చారు. కానీ టైమింగ్స్ చూస్తే అర్ధరాత్రి వేళల్లో ఇచ్చారు. ఇలా ఇవ్వడం ఎంతమాత్రం కరెక్ట్ కాదు. సహాయం చేయాలనుకుంటే మనస్ఫూర్తిగా కడుపు నిండా పెట్టాలి.. అంతేకానీ ఇలాంటి నామమాత్రపు షోలతో ఉపయోగం ఏంటి?. ఇతర భాషల నుంచి వస్తున్న డబ్బింగ్ చిత్రాలు, పెద్ద సినిమాలకు ప్రైమ్ టైమ్ షోలు, మంచి థియేటర్లు కేటాయిస్తున్నారు. చిన్న తెలుగు సినిమాలకు మాత్రం సరైన సమయాల్లో షోలు ఇవ్వకపోవడం అన్యాయం. సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ ఉన్నప్పటికీ.. థియేటర్ల సమస్య కారణంగా ఆ చిత్రంను మరింత మంది ప్రేక్షకులకు చేరకుండా చేయడం సరికాదు’ అని నిర్మాత నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘అనకాపల్లి సినిమాకు విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. మాది 3.5 రేటింగ్‌ సినిమా. మా చిత్రానికి ఆదరణ ఉన్నప్పటికీ.. సరైన థియేటర్లు, షో టైమింగ్స్ లేకపోవడం వల్ల కలెక్షన్లపై ప్రభావం పడుతుంది. ఈ విషయం టాలీవుడ్ పెద్దలు అర్ధం చేసుకుని.. చిన్న సినిమాలను ప్రోత్సహించండి. చిన్న సినిమాలకు కూడా మంచి ప్రాధాన్యం ఇవ్వండి’ అని నిర్మాత కండ్రేగుల నాయుడు కోరారు. చిన్న సినిమాల విడుదల సమయంలో థియేటర్ల కేటాయింపు, షో టైమింగ్స్ విషయంలో పారదర్శకత అవసరమని ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. నిర్మాత నాయుడు చేసిన వ్యాఖ్యలు మరోసారి టాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి.