Idupu Kayitham Song: ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే ఇంట్రెస్టింగ్ బజ్ ను క్రియేట్ చేస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా శ్రీలత.. అనే మొదటి రొమాంటిక్ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. సురేష్ బొబ్బిలి స్వరకల్పనలో, అలరాజు తెలంగాణ యాసలో రాసిన ఈ మెలోడీ సాంగ్‌ను శంకర్ బాబు కందుకూరి, మోహన భోగరాజు ఆలపించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్, నూతన సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలలో షూట్ చేసిన ఈ వీడియోలో ప్రియదర్శి, నాగదుర్గల కెమిస్ట్రీ మరియు డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పాటలో ప్రియదర్శి, నాగదుర్గ జంటగా కొత్తగా పెళ్లైన భార్యాభర్తలుగా కనిపించారు. ‘నువ్వు సిన్నబోకే నా శ్రీలత’ అంటూ సాగే ఈ పాటలో శ్రీలత, శ్రీనివాస్ మధ్య ఉండే ప్రేమ, క్యూట్ మూమెంట్స్‌ను చాలా సహజంగా చూపించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా పాటకు మంచి ప్లస్‌గా నిలిచింది. ఈ పాటకు సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం కూడా హైలెట్ గా నిలిచింది. మెలోడీ ట్యూన్‌తో సాగుతున్న పాటలో తెలంగాణ ఫోక్ టచ్‌ను కూడా చక్కగా కలిపారు. పాటను విన్న తర్వాత ట్యూన్‌తో పాటు లిరిక్స్ కూడా ప్రేక్షకుల నోట్లో నిలిచిపోయేలా ఉంది.
‘ఇడుపు కాయితం’ను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కుటుంబ కథతో రూపొందుతున్న ఈ సినిమాలో శివజ్యోతి, జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చ రవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘శ్రీలత’ పాట చూస్తుంటే ‘ఇడుపు కాయితం’లో వినోదంతో పాటు తెలంగాణ నేటివిటీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోంది. ప్రియదర్శి, నాగదుర్గల జంట, సురేష్ బొబ్బిలి మెలోడీ, తెలంగాణ యాసలో సాగిన సాహిత్యం కలిసి పాటను ఆహ్లాదకరంగా మార్చాయి. డిసెంబర్‌లో సినిమా థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో ‘శ్రీలత’ సాంగ్‌కు వస్తున్న స్పందన మూవీ ప్రమోషన్స్‌కు మంచి బూస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

