ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఏ దర్శకుడితో సినిమా ప్రకటిస్తారో అని అభిమానులు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ప్రభాస్ ‘ఫౌజీ’, మరియు ‘కల్కి 2’ వంటి భారీ సినిమాలతో పూర్తి బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌లు పూర్తయిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘సలార్ 2’ సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ బిజీ షెడ్యూల్ వల్ల ఇప్పట్లో ప్రభాస్ నుంచి కొత్త సినిమా ప్రకటన రావడం కష్టమే అని అందరూ భావించినప్పటికీ అక్టోబర్ 23న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఓ సర్‌ప్రైజింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మలయాళంలో హింసాత్మక ఆక్షన్ డ్రామాగా సరికొత్త రికార్డులు సృష్టించిన ‘మార్కో’ ఫేమ్ దర్శకుడు హనీఫ్ అదేనితో ప్రభాస్ సినిమా చేయబోతున్నారనే వార్త ఫిలింనగర్ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది. రా అండ్ రస్టిక్ యాక్షన్ సినిమాలకు పేరుగాంచిన హనీఫ్ వినిపించిన ఒక పవర్‌ఫుల్ లైన్‌కు ప్రభాస్ కూడా పాజిటివ్‌గా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్‌ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సెట్ చేసే పనిలో ఉన్నారట. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ బిగ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి చాలా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తుంటే, అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా 2028లో ప్రారంభమై 2029లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఊహాగానాల్లో ఎంతవరకు నిజముందో వేచి చూడాల్సిందే.

