Site icon NTV Telugu

Paisawala : ఆసక్తి పెంచుతున్న పైసావాలా ట్రైలర్‌

Pai

Pai

తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ ఇమేజ్‌ కంటే కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న హీరోలు, కొత్త దర్శకులు కూడా ధైర్యంగా డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్‌ కంటెంట్‌తో రాబోతున్న చిత్రమే ‘పైసావాలా’. అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వీకేఎం మూవీస్ బ్యానర్స్‌పై నూనెల పైడిరాజు, కె. నవీన్ తేజస్, పిజె దేవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇక తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని ప్రముఖ గీత రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహిత చంద్రబోస్ రిలీజ్‌ చేసి చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు.

ట్రైలర్‌ విషయానికొస్తే.. “హవాలా నోటు తీసుకొస్తున్న ఎమ్మెల్యే బామ్మర్దికి యాక్సిడెంట్ అయింది. ఫోన్, పర్సు మిస్సింగ్… అందులో హవాలా నోటు ఉంది. ఆ పని నీవల్లే అవుతుంది” అని ఓ గ్యాంగ్‌.. హీరోకి చెప్పే సీన్‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. పసుపు అంటిన పది రూపాయల నోటు కోసం వేర్వేరు గ్యాంగ్‌లు తలపడటం, హత్యలు, కొత్త కొత్త పాత్రల ఎంట్రీలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగుతుంది. చివర్లో తొమ్మిది మంది పాత్రలను చూపిస్తూ “వీళ్లలో అసలు నిందితుడు ఎవరు?” అని సస్పెన్స్‌ను పెంచుతూ ముగిసింది. నగేశ్ గౌరీష్ సంగీతం, గౌతం వాయిలాడ సినిమాటోగ్రఫీ, ఎంజే సూర్య ఎడిటింగ్ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి. ఈ థ్రిల్లర్ డ్రామా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Exit mobile version