Nani Continue as Natural Star Tag: టాలీవుడ్‌లో హీరోలకు ఇచ్చే ట్యాగ్‌లు వారి ఇమేజ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటాయి. స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ‘పుష్ప’ సినిమాకు ముందు ‘స్టైలిష్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ‘పుష్ప’ సినిమా సమయంలో దర్శకుడు సుకుమార్ ఆయనకు ‘ఐకాన్ స్టార్’ అనే కొత్త ట్యాగ్‌ను పరిచయం చేశారు. ఈ పేరు అభిమానులకు బాగా నచ్చడం, పుష్ప ఊహించని హిట్ అవ్వడంతో.. అప్పటి నుంచి అల్లు అర్జున్ ‘ఐకాన్ స్టార్’గానే కొనసాగుతున్నారు.
ఇదే తరహాలో మరో హీరో నాని విషయంలోనూ ఇటీవల ఓ కొత్త ట్యాగ్ తెరపైకి వచ్చింది. నేచురల్ స్టార్‌గా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని.. శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో ‘షేర్ నాని’ అనే ట్యాగ్‌తో కనిపించారు. ముందుగా నేచురల్ స్టార్ నానిగా.. ఆపై షేర్ నానిగా స్క్రీన్‌పై పడింది. అయితే ప్యారడైజ్ మూవీకి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడం, సినిమాకు డివైడ్ టాక్ రావడంతో పాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చోటుచేసుకోవడంతో.. నాని తన పాత ట్యాగ్‌నే కొనసాగించాలని నిర్ణయించుకున్నారట. ఇకపై తన పేరుకు ముందు ‘నేచురల్ స్టార్’ అనే ట్యాగ్‌నే ఉపయోగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ‘షేర్ నాని’ ట్యాగ్‌ను పూర్తిగా పక్కన పెట్టారా? లేదా భవిష్యత్‌లో ఏదైనా సందర్భంలో మళ్లీ ఉపయోగిస్తారా? అనే దానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మాత్రం నాని అభిమానులు మాత్రం ఆయనను ‘నేచురల్ స్టార్ నాని’గానే చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇక ప్యారడైజ్ సినిమా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.155 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెగిటివ్ టాక్ ఉన్నా.. ఈ కలెక్షన్స్ రావడం అద్భుతమే అని చెప్పాలి. నాని జడల్ పాత్రలో నటించగా.. మోహన్ బాబు మాలిక్, కయాడు లోహర్ సుబ్బు పాత్రల్లో నటించారు.

