తెలుగు సినిమా రంగంలో హీరో నాగార్జునకు ఉన్నంత ముందు చూపు వేరే ఏ స్టార్ హీరోకి లేదనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రయోగాత్మక సినిమాలు చేయటమే కాదు కొత్త కొత్త బిజినెస్ లు చేయటంలోనూ నాగ్ ముందుంటుంటాడు. రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటమే కాదు… ఇవాళ పలువురు సినీ ప్రముఖలు పబ్ లు, బార్ల బిజినెస్ లో ఇప్పటి తారలు బిజీగా ఉన్నారు. ఆ బిజినెస్ నాగ్ ఎప్పుడో చేసేశాడు. ఇక చిరంజీవి, అరవింద్, మ్యాట్రిక్ ప్రసాద్ తో కలసి మాటీవీ మొదలెట్టి అక్కడా సక్సెస్ ఫుల్ బిజినెస్ మేన్ అనిపించుకున్నారు. ఆ తర్వాత భారీ లాభాలకు స్టార్ కి అమ్మేసినా మాతో నాగ్ అనుబంధం కొనసాగుతూనే ఉంది. స్టార్ గా రాణిస్తూనే బుల్లితెరపై కూడా నటించి టాప్ స్టార్స్ కి కొత్త దారి చూపించాడు.
ప్రస్తుతానికి వస్తే ఓటీటీ బిజినెస్ లోకి కూడా ఎంటరవ్వాలనుకుంటున్నాడట. గతేడాదే నాగ్ ఓటీటీ రంగంలోకి ఎంట్రీ ఇవ్వటం ఖాయమని వినిపించింది. అప్పుడే కరోనా రావటంతో ఆ ఆలోచన వాయిదా పడిందట. అయితే ఓటీటీ రంగంలో అల్లు అరవింద్ ‘ఆహా’తో సక్సెస్ సాధించారు. ఇక కరోనాతో కలసి జీవించాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో భవిష్యత్ అంతా డిజిటల్ రంగానిదే అని వినిపిస్తోంది. ప్రేక్షకులకు కూడా ఇంట్లో ఉండే ఎంటర్ టైన్ మెంట్ ను ఆస్వాదించాలనుకుంటున్నారు. అందుకు డిజిటల్ రంగానికి ప్రత్యేకించి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కి దక్కుతున్న ఆదరణే నిదర్శనం. అదీ కాక నాగ్ కి అండగా అక్కినేని ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ ఉండనే ఉంది. దాని నిర్వహణను అమలా నాగార్జున చూసుకుంటున్నారు. ఆ ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ నుంచి వచ్చిన విద్యార్థులలో ఇప్పటికే పలు షార్ట్ ఫిలిమ్స్ రూపు దిద్దుకున్నాయి. సినిమాలను కూడా విరివిగా ప్లాన్ చేయబోతున్నారట. కరోనా సెకండ్ వేవ్ వల్ల బ్రేక్ పడింది కానీ లేకుంటే ఈపాటికే పలు ప్రాజెక్ట్ ల ప్రకటన వచ్చి ఉండేది. వాటన్నింటికీ ఓ ప్లాట్ ఫామ్ కూడా అవసరం ఉంది. అందుకే సొంతంగా ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆరంభించబోతున్నారట. మరి దీనిని ఆయన ఒక్కరే ఆరంభిస్తారా? లేక గతంలో మాటీవీలో భాగస్వాములైన మ్యాట్రిక్స్ ప్రసాద్, చిరంజీవి కూడా తోడుగా ఉంటారా? అనే విషయమై క్లారిటీ లేదు. కొద్ది రోజులు ఆగితే కానీ క్లియర్ పిక్చర్ రాదు. ఇక నాగ్ తో పాటు అక్కినేని కుంటుంబ సభ్యలు సమంత, చైతన్య కూడా వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. సో… కంటెంట్ పరంగా చాలా వరకూ కవర్ చేసుకోవచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో!?
ఓటీటీ రంగంలోకి నాగ్!?
