The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు

Mohan Babu (2)

Mohan Babu (2)

The Paradise: ‘ది ప్యారడైజ్‌లో ’ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ, చిత్ర యూనిట్ పంచుకున్న విశేషాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. న్యాచురల్ స్టార్ నాని, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మధ్య జరిగిన పోస్ట్ రిలీజ్ చిట్‌చాట్‌లో మోహన్ బాబు తన పాత్రపై చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమాలో ‘షికంజా మాలిక్’ అనే భయంకరమైన విలన్ పాత్రను ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చిందనే ప్రశ్నకు మోహన్ బాబు ఎవరూ ఊహించని రీతిలో సమాధానమిచ్చారు. “మనిషి జీవితంలో కొన్నిసార్లు డ్రైవింగ్ చేస్తూ బ్రేక్ వేయబోయి పొరపాటున యాక్సిలరేటర్ నొక్కేస్తాడు.. అప్పుడు అనుకోని ప్రమాదం జరుగుతుంది. ఈ పాత్రను ఒప్పుకోవడం కూడా నాకు సరిగ్గా అలాంటి మిస్టేకే. ఆ క్షణంలో ఎందుకు కమిట్ అయ్యానో ఇప్పటికీ కారణం చెప్పలేను. దర్శకుడు వచ్చిన వేళావిశేషమో లేక రాసిపెట్టి ఉందో కానీ అలా జరిగిపోయింది” అంటూ కుండబద్దలు కొట్టారు.

శ్రీకాంత్ ఓదెల తన వద్దకు వచ్చి కథ చెప్పినప్పుడు విషయం వేరని, తెరపైకి వచ్చాక చూస్తే అసలు స్వరూపం వేరని మోహన్ బాబు వివరించారు. “కథ బాగుంది అని చెప్పారు తప్ప, గర్భిణీ స్త్రీలను సైతం నిర్దాక్షిణ్యంగా నరికేసే ఇంత భయంకరమైన, పైశాచికమైన విలనిజం ఉంటుందని నాకు ముందు చెప్పలేదు. ఇంతటి క్రూరమైన క్యారెక్టర్ అని నాకు ముందే తెలిసి ఉంటే బహుశా నేను ఈ పాత్రకు అస్సలు అంగీకరించేవాడినే కాదేమో” అంటూ మోహన్ బాబు బాంబు పేల్చారు. ఐదు వందలకు పైగా చిత్రాలు చేసి, నటనలో అన్ని శిఖరాలనూ చూసిన తనకు ఈ తరంలో నాని అంటే ప్రత్యేకమైన అభిమానమని మోహన్ బాబు స్పష్టం చేశారు. నాని మీద ఉన్న ఇష్టం, దర్శకుడి పనితీరుపై నమ్మకంతోనే ఆ రాక్షస పాత్రను సైతం స్వీకరించి ప్రాణం పోశానని చెప్పారు. తెరపై ‘షికంజా మాలిక్’గా మోహన్ బాబు చూపించిన క్రూరత్వం థియేటర్లలో ప్రేక్షకులను వెన్నులో వణుకు పుట్టిస్తుండగా, ఆ పాత్ర వెనుక ఉన్న అసలు నిజాన్ని ఆయన స్వయంగా బయటపెట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.