ప్రముఖ యాంకర్, నటుడు టిఎన్‌ఆర్ ను సోమవారం (మే 10) కోవిడ్ -19 బలి తీసుకుంది. ఈ టిఎన్‌ఆర్ మరణ వార్త మీడియా వర్గాలను, తెలుగు చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజాగా సీనియర్ నటుడు మోహన్ బాబు టిఎన్‌ఆర్ మరణం బాధను కలిగించింది అంటూ ట్వీట్ చేశారు. “ప్రముఖ జర్నలిస్ట్ తుమ్మల నరసింహా రావు (#TNR) మరణం నా మనసును కలచివేసింది. ఇతను గతంలో తన ఛానల్ లో నన్ను ఇంటర్వ్యూ చేశారు. చాలా మంచి మనిషి, మంచి నటుడు. ఆ రోజు అతనికి చెప్పాను నా పిక్చర్ లో మంచి వేషం ఇస్తానని. ఇప్పుడు నేను తీస్తున్న ‘సన్ ఆఫ్ ఇండియా’లో ఆయన మంచి వేషం కూడా వేశారు. చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి, ఆయన కుటుంబానికి మనశ్శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను” అంటూ సంతాపం తెలియజేశారు మోహన్ బాబు. కాగా టిఎన్‌ఆర్ కు వారం క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హైదరాబాద్, మల్కాజ్ గిరి లోని ఆసుపత్రిలో చేరారు. టిఎన్ఆర్ ఆక్సిజన్ స్థాయి గణనీయంగా తగ్గడం వల్ల శ్వాస సమస్యతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారని తెలుస్తోంది.
నా పిక్చర్ లో టిఎన్‌ఆర్ కు వేషం ఇస్తానని చెప్పా… : మోహన్ బాబు
