Manchu Manoj New Movie: విభిన్నమైన కథలు, పవర్ఫుల్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, పోతరాజు నేపథ్యంలో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో నటించనున్నారు. దైవిక అంశాలు, ఉత్కంఠభరితమైన కథనం, భారీ యాక్షన్ సన్నివేశాల కలయికతో ఈ సినిమాను ‘డివైన్ యాక్షన్ థ్రిల్లర్’గా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని RPA క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
‘ప్రేమకథా చిత్రం’, ‘జక్కన్న’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన నిర్మాతలు ఆర్.పీ. అక్షిత్ రెడ్డి, ఆర్. సుదర్శన్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. తెలంగాణ పండుగల వైభవం, స్థానిక సంప్రదాయాలు, పోతురాజు నేపథ్యాన్ని ప్రధానంగా తీసుకొని ఈ చిత్ర కథను రూపొందించారు. దైవిక అంశాలతో పాటు ఉత్కంఠను రేకెత్తించే కథనం, భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద కో-డైరెక్టర్‌గా పనిచేసిన ఏ. శ్రీధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయన అత్యంత శక్తివంతమైన కథను సిద్ధం చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది.
ఇప్పటివరకు మంచు మనోజ్‌ను చూడని సరికొత్త అవతార్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ అనుభూతిని అందించనుంది. ఈ ప్రాజెక్ట్‌కు ఎం. శ్రీకాంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, ఆర్. ఆయుష్ రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. చిత్ర టైటిల్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్ ప్రారంభం తదితర వివరాలను చిత్రబృందం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.

