బాలనటునిగానే భళా అనిపించిన మంచు మనోజ్, కథానాయకునిగానూ కదం తొక్కాడు. కానీ, ఎందుకనో కొంతకాలంగా మనోజ్ పదం మునుపటిలా ముందుకు సాగడం లేదు. అయినా మనోజ్ తనకంటూ కొంతమంది అభిమాన గణాలను సొంతం చేసుకొని, వారిని మెప్పించే ప్రయత్నంలోనే ఉన్నాడు. మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమా బరిలోకి అయితే దూకాడు కానీ, తండ్రిలా వడి వాడి వేడి అన్నవి మనోజ్ లో అంతగా కనిపించవు. మనోజ్ ఆచితూచి అడుగు వేస్తూ సాగడం వెనుక కారణాలేమున్నా, అతని సినిమా వస్తోందంటే కొందరు అభిమానులు మాత్రం ఆనందంతో చిందులు వేస్తూ ఉంటారు. మనోజ్ సినిమా ఎప్పుడు వచ్చినా, చూడటానికి మేం సిద్ధం అనే వారున్నారు.
బాల్యంలోనే మనోజ్ కు కెమెరా ముందు అదురు బెదురు లేకుండా నటించడం అలవాటయింది. మహానటుడు నందమూరి తారక రామారావుతో మోహన్ బాబు నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’లో యన్టీఆర్ తో కలసి నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నాడు మనోజ్. తండ్రికి యన్టీఆర్ అంటే ఎంతటి అభిమానమో, అంతే అభిమానం మనోజ్ కూ రామారావుపై ఉంది. అందుకే ‘బిందాస్’తో తనకు లభించిన ‘స్పెషల్ జ్యూరీ నంది’ అవార్డును తమ ఇంటిలోని యన్టీఆర్ పటం ముందు పెట్టి ఆనందించారు. రామారావు అంతటి మహానటునికి నంది అవార్డు రాలేదే అన్నది తనకు విచారం కలిగిస్తుందని మనోజ్ ఓ సందర్భంలో అన్నాడు. నటులకు నంది అవార్డుల్లో ఉత్తమ నటుడు పురస్కారం అందించే సమయానికే యన్టీఆర్, అప్పటి ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ చిత్ర దండయాత్ర చేస్తున్నారు. ఆ తరువాత ఐదేళ్ళకు యన్టీఆరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. మరి నందమూరి నటనకు ‘నంది’ పురస్కారం లభించలేదంటే ఎలా? అంటూ తండ్రి మోహన్ బాబు వివరించారు. దాంతో సంతృప్తి చెందాడు మనోజ్. తాను కూడా ఆ మహానటుడు జన్మించిన ‘మే మాసం’లోనే పుట్టడం అదృష్టంగా భావిస్తూ ముందుకు సాగుతున్నాడు. తండ్రి హీరోగా రూపొందిన “అడవిలో అన్న, ఖైదీగారు” వంటి చిత్రాలలో బాలనటునిగానే మెప్పించిన మనోజ్ ‘దొంగ-దొంగది’ చిత్రంతో హీరోగా జనం ముందు నిలిచాడు. కొందరి మదిని గెలిచాడు. అప్పటి నుంచీ తనకు తగ్గ పాత్రలు ఎంపిక చేసుకొని ముందడుగు వేశాడు. “శ్రీ, రాజూ భాయ్, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంట్ తీగ, గుంటూరోడు” వంటి చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లో కనిపించాడు మనోజ్. ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో తండ్రి మోహన్ బాబు, అన్న విష్ణుతో కలసి నటించిన మనోజ్ భలేగా మార్కులు కొట్టేశాడు. ప్రస్తుతం ‘అహం బ్రహ్మస్మి’ సినిమాతో జనం ముందుకు వచ్చే ప్రయత్నంలో ఉన్నాడు మనోజ్.
(మే 20న మంచు మనోజ్ జన్మదినోత్సవం)