Site icon NTV Telugu

Razakar: రజాకార్ సినిమాకి ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు!

Dada

Dada

15వ దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమాటోగ్రఫర్ కుశేందర్ రమేష్ రెడ్డికి ఉత్తమ సినిమాటోగ్రఫర్ పురస్కారం లభించింది. ‘రజాకార్’ చిత్రంలోని అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ఈ చిత్రం ద్వారా విశేష గుర్తింపు పొందారు. కేకే సెంథిల్ కుమార్ వద్ద ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘RRR’ చిత్రాలకు చీఫ్ అసోసియేట్‌గా పనిచేసిన రమేష్, అనుభవంతో అంచలంచెలుగా ఎదిగి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. ‘రజాకార్’ చిత్రం నిజాం రాజు నిరంకుశ పాలన, రజాకర్ల దౌర్జన్యాలను అంతం చేసి, నిజాం రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గాథను వెల్లడిస్తుంది. దర్శకుడు యాటా సత్యనారాయణ విజన్‌కు కుశేందర్ రమేష్ రెడ్డి సినిమాటోగ్రఫీ జీవం పోసింది. చరిత్రను సజీవంగా ఆవిష్కరించిన ఈ చిత్రంలో ఆయన కెమెరా పనితనం కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం రమేష్ , వానర సెల్యులాయిడ్ మరియు డైరెక్టర్ మారుతి సమర్పణలో మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బార్బరిక్’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే, పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాధ్ కథతో, నాని దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా, కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా, చిట్టూరి శ్రీనివాస్ నిర్మాణంలో ఎస్ఎస్ఎస్ ప్రొడక్షన్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘12A రైల్వే కాలనీ’ చిత్రానికి కూడా పనిచేస్తున్నారు. చిన్నా పెద్దా అనే భేదం లేకుండా, కంటెంట్‌ ఉన్న కథలను ఎంచుకుంటూ, తనదైన శైలితో దర్శకుల విజన్‌కు దృశ్యరూపం ఇస్తూ కుశేందర్ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Exit mobile version