NTV Telugu Site icon

టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న ధ‌నుష్!

Kollywood Star Dhanush Tollywood Entry Confirmed?

కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య‌, కార్తీ ఇప్ప‌టికే స్ట్ర‌యిట్ తెలుగు సినిమాల‌లో న‌టించేశారు. విజ‌య్ ఆంటోని సైతం తెలుగులో త‌న చిత్రాల‌కు ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌ను దృష్టిలో పెట్టుకుని స్ట్ర‌యిట్ తెలుగు సినిమాలో త‌ప్ప‌కుండా న‌టిస్తాన‌ని చెబుతున్నాడు. ఇక ఇటీవ‌ల విజ‌య్ తో తెలుగు సినిమా తీయ‌బోతున్న‌ట్టు ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ప్ర‌క‌టించాడు. ఈ నేప‌థ్యంలోనే త‌మిళ స్టార్ హీరో ధ‌నుష్ కూడా తెలుగు సినిమాలో న‌టించ‌డానికి ప‌చ్చ‌జెండా ఊపిన‌ట్టు తెలుస్తోంది. నిజానికి చాలా కాలం త‌మిళ‌చిత్ర‌సీమ‌కే ప‌రిమితం అయిన ధ‌నుష్ ఆ మ‌ధ్య హిందీ సినీ రంగ ప్ర‌వేశం చేశాడు. ఆ త‌ర్వాత ఆంగ్ల చిత్రంలో న‌టించాడు. ఇప్పుడు ఓ అమెరిక‌న్ మూవీలోనూ న‌టిస్తున్నాడు. ఆ ర‌కంగా చూసిన‌ప్పుడు ధ‌నుష్ ద‌క్షిణాది భాష‌ల్లో త‌మిళం త‌ర్వాత న‌టిస్తున్నది తెలుగులోనే అని చెప్పాలి. ఓ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ, ఓ పాపుల‌ర్ ద‌ర్శ‌కుడితో ఈ సినిమాను నిర్మించ‌బోతోంద‌ట‌. రెండు మూడు భాష‌ల్లో నిర్మితం కాబోతున్న ఈ మూవీలో ఓ సీనియ‌ర్ హీరో కూడా న‌టించ‌బోతున్నాడ‌ట‌. తెలుగులోనూ ఇటీవ‌ల ధ‌నుష్ న‌టించిన సినిమాల‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌టం, వ‌ర‌ల్డ్ వైడ్ అత‌నికి విశేషంగా అభిమానులు ఉండ‌టంతో స‌హ‌జంగానే ఈ ప్రాజెక్ట్ కు క్రేజ్ వ‌చ్చే ఆస్కారం ఉంది. చిత్రం ఏమంటే… ఈ మూవీ క‌థ గురించి, సాంకేతిక నిపుణుల గురించి తెలిసిన ఓ తెలుగు స్టార్ హీరో తానే న‌టిస్తానంటూ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌కు హింట్ ఇస్తున్నాడ‌ట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.