మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు వచ్చి చాలా కాలమైంది. ప్రస్తుతం వెండితెరపై మాస్, మసాలా, యాక్షన్, కామెడీ చిత్రాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ స్వచ్ఛమైన వింటేజ్ విలేజ్ లవ్ స్టోరీలు, ఎమోషనల్ డ్రామాలు మాత్రం అరుదుగా కనిపిస్తున్నాయి. ఈ లోటును పూరించేందుకు ‘కౌసల్య తనయ రాఘవ’ అనే చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజేష్ కొంచాడా, శ్రావణి శెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అడపా రత్నాకర్ నిర్మిస్తున్నారు. కుటుంబం మొత్తం కలిసి చూడదగ్గ
ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు స్వామి పట్నాయక్ కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆర్కే నాయుడు, చంటి, నిర్మాత రత్నాకర్ కలిసి ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్ ఆరంభం, కథను పరిచయం చేసిన విధానం, పాత్రల పరిచయం చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈ చిత్రం సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో రూపొందినట్టు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. ఒక గ్రామం నేపథ్యంలో హీరో, హీరోయిన్, విలన్ పాత్రల చుట్టూ కథ సాగుతుంది. అయితే, ఈ సినిమా కేవలం ప్రేమ కథతోనే కాకుండా ఒక మంచి సందేశాన్ని కూడా అందిస్తున్నట్టు కనిపిస్తోంది. చదువు యొక్క ప్రాముఖ్యతను అంతర్లీనంగా చెప్పే ప్రయత్నం దర్శకుడు చేశారు. 80వ దశకంలోని కథను తెరపై అందంగా ఆవిష్కరించినట్టు అనిపిస్తోంది. ‘కౌసల్య తనయ రాఘవ’ ట్రైలర్‌లో విజువల్స్, మ్యూజిక్ చాలా సహజంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి. యోగి రెడ్డి సినిమాటోగ్రఫీ ఆ గత కాలపు వాతావరణాన్ని తిరిగి ఆవిష్కరించినట్టు అనిపిస్తుంది. రాజేష్ రాజ్ తేలు సంగీతం వినసొంపుగా, హృదయాన్ని తాకేలా ఉంది. విజువల్స్, సంగీతం ట్రైలర్‌లో అందరినీ ఆకట్టుకునే అంశాలుగా నిలిచాయి. ఈ సినిమాను ఏప్రిల్ 11, 2025న విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
