Karthi New Movie: కార్తికి మరో భారీ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్‌తో ఫస్ట్ టైమ్ .. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కొత్త సినిమా!

Karthi New Movie (2)

Karthi New Movie (2)

Karthi New Movie: విభిన్నమైన కథలను ఎంచుకని దూసుకెళ్తున్న హీరో కార్తి ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. కమర్షియల్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు మోహన్ రాజాతో తొలిసారి కార్తి చేతులు కలిపారు. ఈ మూవీకి సైన్ చేసినట్టు ఇప్పటికే ఆఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా జరిగిపోయింది. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనుంది. దీనిని పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించగానే కార్తి, మోహన్ రాజా అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమాతో దర్శకుడు మోహన్ రాజా మరోసారి తన సొంత కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతంలో ఆయన సొంత కథతో తెరకెక్కించిన ‘తని ఒరువన్’, ‘వేలైక్కారన్’ సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ హిట్ కూడా అందుకున్నాయి. ఇప్పుడు అదే తరహాలో మూడోసారి తన ఒరిజినల్ స్క్రిప్ట్‌తో కొత్త కథను తెరపైకి తీసుకురానుండటం ఈ ప్రాజెక్ట్‌కు మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ తర్వాత మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న మూవీ కూడా ఇదే. అంతకుముందు ‘ఎం. కుమారన్ ఎస్/ఓ మహాలక్ష్మి’, ‘వేలాయుధం’, ‘తని ఒరువన్’ వంటి హిట్ లతో ఆయన కమర్షియల్ దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఈసారి కార్తితో ఆయన ఎలాంటి కథను చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నటీనటులు, టెక్నికల్  అంశాలకు సంబంధించిన వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక షూటింగ్‌ను కూడా 2026 చివరి నాటికి ప్రారంభించే ప్రణాళికలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కార్తి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘సర్దార్ 2’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం ఘన విజయం సాధించడంతో ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ‘మార్షల్’ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, దర్శకుడు కళ్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న పూర్తి స్థాయి తెలుగు సినిమాలో కూడా కార్తి నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ మూవీ 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. వరుసగా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న కార్తి, ఇప్పుడు మోహన్ రాజాతో కొత్త కలయికలో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.