ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్ దృష్టి బ్రిటీష్ కాలం నాటి ప్రముఖ న్యాయవాది సి. శంకరన్ నాయర్ జీవితంపై పడింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలు అందించిన శంకరన్ నాయర్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ లోనూ సభ్యునిగా బాధ్యతలు నెరవేర్చారు. అయితే 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలా బాగ్ మారణకాండ అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు.. ఆ మారణకాండ విషయమై ప్రభుత్వం దాచిన పెట్టిన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చి బ్రిటీష్ రాజ్ తో న్యాయపోరాటం చేశారు శంకరన్ నాయర్.
Read Also: ఎన్టీయార్, చెర్రీ ఫ్యాన్స్ కడుపు నింపేసిన రాజమౌళి!
ఆయన జీవితంలోని ఈ కీలక ఘట్టాన్ని వారి ముని మనువడు రఘు పాలట్, ఆయన భార్య పుష్ప పాలట్ ‘ది కేస్ దట్ షాక్ ది ఎంపైర్’ అనే పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. ఆ రచన ఆధారంగా కరణ్ జోహార్ ఇప్పుడీ సినిమాను నిర్మించబోతున్నారు. ‘ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సి. శంకరన్ నాయర్’ పేరుతో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమాను కరణ్ సింగ్ త్యాగి డైరెక్ట్ చేయబోతున్నాడు. స్టిల్ అండ్ స్టిల్ మీడియా కలెక్టివ్ తో కలిసి తాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నానని, నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియచేస్తానని, మూవీ కూడా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళుతుందని కరణ్ జోహార్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘సూర్యవంశీ’ విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘బ్రహ్మాస్త్ర’, ‘దోస్తానా -2’, ‘మీనాక్షి సుందరేశ్వర్’ చిత్రాలు వివిధ దశల్లో ఉన్నాయి. అలానే మాధురీ దీక్షిత్ తో ‘ఫైండింగ్ అనామిక’తో పాటు, ‘ఫ్యాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైఫ్స్’ సీజన్ 2 నిర్మాణం జరుపుకుంటోంది. ఇక రణవీర్ సింగ్, అలియాభట్, విక్కీ విశాల్, కరీనా కపూర్ ఖాన్, అనిల్ కపూర్, జన్వీ కపూర్, భూమి ఫడ్నేకర్ తో కరణ్ జోహార్ పిరియడ్ డ్రామా ‘తక్త్’ ను డైరెక్ట్ చేస్తున్నారు.
