ఈ దసరా పండుగ సీజన్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా సృష్టించబోతోంది. థియేటర్లలో సందడి చేసేందుకు ఏకంగా నాలుగు క్రేజీ చిత్రాలు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 9న విక్టరీ వెంకటేష్ నటించిన ‘ఆదర్శకుటుంబం’, యంగ్ హీరో శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ చిత్రాలు విడుదలవుతుండగా అక్టోబర్ 15న సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’, అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. విభిన్న జానర్లలో తెరకెక్కిన ఈ నాలుగు సినిమాలపై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకుల్లోనూ విశేషమైన అంచనాలు నెలకొన్నాయి.
అందరికంటే ముందుగా వస్తున్నాడు విక్టరీ వెంకటేష్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేస్తున్న ‘ఆదర్శకుటుంబం’ తన మార్క్ స్టైలిష్ మార్క్ తో పాటు లైట్‌గా క్రైమ్ ఎలిమెంట్స్ కూడా జోడించి రూపొందించడం సినిమా ఈ నెల9న రిలీజ్ కానుంది. కానీ ఇప్పటికే సరైన బజ్ అయితే మాత్రం లేదు. అదే రోజున విడుదలవుతోంది శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’. నక్సలిజం అనే సీరియస్ బ్యాక్‌డ్రాప్‌కి కామెడీని జోడించి వస్తున్న ఈ సినిమా వస్తున్నట్టు కూడా తెలియదు.
ఇక దసరా వారం మధ్యలో అక్టోబర్ 15న సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’తో థియేటర్లలోకి రానున్నారు. బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిన ‘జైలర్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం ఫ్యామిలీ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా అలరించబోతోంది. పార్ట్-1 కంటే రెట్టింపు ఆదరణ పొందేలా భారీ స్థాయిలో డైరెక్టర్ నెల్సన్ ఈ చిత్రాన్ని డిజైన్ చేశారని తెలుస్తోంది. దసరా సినిమాలలో కాస్త కూస్తో హైప్ ఉన్న సినిమా ఇదే. ఈ రేసులో అక్టోబర్ 16న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘టాక్సీవాలా’ తర్వాత ఆ విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో పీరియాడిక్ కథాంశంతో వస్తున్న ఈ చిత్రంపై ఎందుకనో అనుకున్న స్థాయి బజ్ రావడం లేదు. మరి ఈ నాలుగు సినిమాలలో ఏ సినిమా సూపర్ హిట్ టాక్ తెచుకుంటుందో చూడాలి.

