Anil RaviPudi : అనిల్ రావిపూడికి సొంత ఐడియాలు లేవా?

Anil Ravipudi

Anil Ravipudi

టాలీవుడ్‌లో కమర్షియల్ కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం తన మార్క్ ప్రమోషన్స్‌తో వార్తల్లో నిలుస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద వరుస విజయాలు సాధిస్తున్నప్పటికీ, ఆయన సినిమాల పబ్లిసిటీ కంటెంట్‌పై సోషల్ మీడియాలో ఒక కొత్త చర్చ మొదలైంది. ప్రమోషనల్ వీడియోల్లో ఆయన సొంత ఆలోచనలు వాడటం లేదని, సీనియర్ దర్శకుల వింటేజ్ సీన్లు, స్టైల్స్‌ను ఇమిటేట్ చేస్తున్నారనే కామెంట్స్ నెటిజన్ల నుంచి వినిపిస్తున్నాయి.

ఆ మధ్య మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌ను సినిమాలోకి ఆహ్వానిస్తూ విడుదల చేసిన ఇంట్రడక్షన్ వీడియో చూస్తే ఇది స్పష్టమవుతోందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హాస్యబ్రహ్మ జంధ్యాల గారి క్లాసిక్ కామెడీ సీన్‌ను రీక్రియేట్ చేస్తూ అనిల్ రావిపూడి ఈ వీడియోను ప్లాన్ చేశారు. అంతేకాకుండా, సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ లేదా పోస్టర్ డిజైన్‌లలో దర్శకుడు వంశీ మార్క్ స్టైల్‌ను అనుకరించడం రిలీజ్ డేట్ ప్రకటన వీడియోల్లో ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లోని ఐకానిక్ కామెడీ క్లిప్స్‌ను యాడ్ చేయడం కనిపిస్తోంది. ఇలా ప్రమోషన్స్ కోసం లెజెండరీ దర్శకుల స్టైల్‌ను వాడుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సీనియర్ డైరెక్టర్లకు ఇస్తున్న “ట్రిబ్యూట్” అని సమర్థిస్తుండగా, మరికొందరు మాత్రం అనిల్ రావిపూడికి ప్రమోషన్స్ కోసం కొత్త ఐడియాలు లేకనే ఇలా పాత దర్శకుల కామెడీని వాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో చేయబోయే నెక్స్ట్ ప్రమోషన్స్ కోసం అనిల్ రావిపూడి ఇంకే సీనియర్ కామెడీ దర్శకుడి ఐకానిక్ స్టైల్‌ను వాడేస్తారో చూడాలని నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు.