Site icon NTV Telugu

Shivaji: ‘దండోరా’లో నా పాత్ర మిస్టరీ.. ఇది పక్కా కమర్షియల్

Shivaji

Shivaji

విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు శివాజీ ప్రధాన పాత్ర పోషించిన తాజా చిత్రం ‘దండోరా’. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని ఈ సినిమాను రూపొందించారు. మురళీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 25న భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్లలో భాగంగా శివాజీ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు.

‘కోర్ట్’ కంటే ముందే ‘దండోరా’కు ఓకే
“నేను ముందుగా ‘దండోరా’ కథ విన్నాను. ఆ వెంటనే మేకర్స్ అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే నిర్మాణంలో ఆలస్యం జరగడంతో, ‘కోర్ట్’ చిత్రం ముందుగా విడుదల అయింది” అని శివాజీ తెలిపారు. ‘దండోరా’లో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

‘దండోరా’లో తన పాత్ర గురించి వివరిస్తూ..
“ఈ చిత్రంలో నా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. ప్రేక్షకుడికి నేను మంచోడినా? చెడ్డోడినా? అనేది వెంటనే అర్థం కాదు. సినిమా చూసిన తరువాతే ఆడియెన్స్ నా క్యారెక్టర్ గురించి చెప్పాల్సి ఉంటుంది. నేను ఈ చిత్రంలో ఒక వ్యవసాయదారుడి పాత్ర పోషించాను. అయితే ఈ కథలోని అన్ని పాత్రలు నా చుట్టూనే తిరుగుతాయి. అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర నాది. ఇలాంటి పాత్రలు, కథలు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇందులో ఏ పాత్ర కూడా వచ్చి వెళ్లినట్టుగా ఉండదు; అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది” అని శివాజీ స్పష్టం చేశారు.

కమర్షియల్ అంశాలతో అద్భుతమైన కథనం
‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రమేనా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. “దండోరా పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి, తెరకెక్కించిన అద్భుతమైన చిత్రమిది. ఇందులో అన్ని రకాల భావోద్వేగాలు (ఎమోషన్స్) ఉంటాయి. ‘దండోరా’ స్క్రీన్ ప్లే చాలా గొప్పగా ఉంటుంది. ఎంతో సహజంగా ఉండే సినిమా ఇది” అని సినిమాపై తన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

“కోర్ట్‌లో మంగపతి పాత్రకు ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, ‘దండోరా’లోని పాత్రకి కూడా అంతే రెస్పాన్స్ వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు. నటుడిగా ఎంతో అదృష్టం ఉంటే తప్పా ఇలాంటి పాత్రలు రావని, ఇందులో తన పాత్రలో డిఫరెంట్ షేడ్స్, ఎన్నో రకాల ఎమోషన్స్ చూపించే అవకాశం లభించిందని శివాజీ సంతోషం వ్యక్తం చేశారు.

కొత్త దర్శకులతో ఎక్కువ ప్రయాణం
“నేను దాదాపు కొత్త దర్శకులతోనే ఎక్కువగా పని చేస్తున్నాను. మన మేకర్స్ లెక్కలు వేసుకుంటూ, పొటెన్షియల్ ఉన్న యాక్టర్స్ ఉన్నా కూడా పక్క భాషల నుంచి తీసుకు వస్తుంటారు. ఈ చిత్రంలో నవదీప్, నందు, రవికృష్ణ వంటి అద్భుతమైన ఆర్టిస్టులు ఉన్నారు. నేను దాదాపు 30 ఏళ్ల నుంచి ఇక్కడే ఉన్నాను. నేను ఇది వరకు నెగెటివ్ పాత్రలు కూడా పోషించాను. కానీ మన దర్శకులకు నేను ఎక్కువగా కనిపించలేదేమో” అని తెలుగు సినిమా పరిశ్రమపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘మిస్సమ్మ’, ‘అదిరిందయ్య చంద్రం’ వంటి కామెడీ, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసినా, నటుడిగా నా మీద నాకు నమ్మకం ఉండేదని, ఇప్పుడు కాలం కలిసి వచ్చిందని శివాజీ అన్నారు.

భవిష్యత్ ప్రాజెక్టులు:
‘దండోరా’ తరువాత తన నుంచి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రం రాబోతోందని శివాజీ వెల్లడించారు. అలాగే, ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రానున్న ‘ఎపిక్’ అద్భుతంగా ఉంటుందని, తండ్రీకొడుకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోందని ఆయన తెలిపారు.

Exit mobile version