నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: ది తాండవం’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో సంచలనాలు సృష్టిస్తోంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 12న విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
సినిమాకు వస్తున్న రెవిన్యూ గురించి బోయపాటి మాట్లాడుతూ, కర్ణాటక, చెన్నై, హిందీ మార్కెట్లలో సినిమా ఊర్రూతలూగుతోందని తెలిపారు. “మారుమూల గ్రామాల్లో కూడా సినిమా ఆడుతోంది. అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. రెవిన్యూ పరంగా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాం” అని ఆయన అన్నారు. ‘అఖండ 2’ భారత దేశ ఆత్మ లాంటిదని, అందుకే ఈ సినిమా అందరికీ చేరాలనే ఉద్దేశంతో తీశామని ఆయన స్పష్టం చేశారు. సినిమా విజువల్స్ గురించి బోయపాటి మాట్లాడుతూ, త్రీడీ (3D) వెర్షన్‌లో సినిమాను చూడాలని ప్రేక్షకులకు సూచించారు. “అఖండ 2 త్రీడీలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ సినిమాని త్రీడీలో పిల్లలకు చూపిస్తే మరోసారి వెళ్దామని అంటారు. అంత గ్రాండీయర్‌గా వచ్చింది” అని అన్నారు.
ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఒక మంచి పౌరాణిక సినిమా చేస్తే బాగుంటుందని అభిప్రాయం కలిగిందా అనే ప్రశ్నకు బోయపాటి బదులిస్తూ…”నాకు అలాంటి ఆలోచన ఉంది. ఈ సినిమా వరకు మాత్రం ఆ భగవంతుడే పక్కనుండి నడిపించాడు. మేము చేసిన క్లైమేట్లో ఎవరూ చేయలేరు. ఇంపాజిబుల్. కొన్ని లొకేషన్ ఫోటోలు చూపిస్తే నిజంగా భయపడతారు. అయినా మేము ఎక్కడ భయపడలేదు. నాకు ప్రతి జోనర్ చేయాలని ఉంది. అన్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్న తర్వాతే చేయాలి.” పౌరాణిక చిత్రాల పట్ల తనకు ఆసక్తి ఉన్నా, పూర్తి సన్నద్ధత తర్వాతే అడుగు ముందుకు వేయాలని బోయపాటి శ్రీను స్పష్టం చేశారు.
