Malayalam Thriller: ఓటీటీల్లో ప్రతి వారం కొత్త సినిమాలు వస్తుంటాయి. అయితే కొన్ని సినిమాలు మాత్రం కథ, మేకింగ్, సస్పెన్స్‌తో ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. అలాంటి సినిమాల్లో ఇప్పుడు మరో మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ చేరబోతోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ‘బాలన్: ది బాయ్’ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుండటంతో థ్రిల్లర్ అభిమానులు చూసేందుకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఇప్పటికే మలయాళ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఆదరణ లభిస్తుండగా, ఈ మూవీ కూడా అదే జాబితాలో చేరుతుందా అనే చర్చ మొదలైంది.
జీ5లో స్ట్రీమింగ్
‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన తాజా చిత్రం ‘బాలన్: ది బాయ్’. జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ జానర్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం జూలై 31 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాపై మొదటి నుంచే మంచి అంచనాలు నెలకొనడానికి మరో ముఖ్య కారణం రచయిత జితు మాధవన్. ‘ఆవేశం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రానికి కథ అందించిన ఆయన ఈ చిత్రానికి కూడా రచయితగా పని చేశారు. చిదంబరం దర్శకత్వం, జితు మాధవన్ రచన కలయికతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో ఆడియన్స్ ను బాగానే థ్రిల్ చేసింది.
ఈ చిత్రంలో ఆదిశేషన్ కె.ఆర్., ఫర్జానా పలాతింగల్, ముహమ్మద్ జినాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, యాక్టింగ్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక టెక్నికల్ అంశాల పరంగా కూడా ‘బాలన్: ది బాయ్’ ప్రశంసలు అందుకుంది. ‘మంజుమ్మెల్ బాయ్స్’కు సంగీతం అందించిన సుషిన్ శ్యామ్ ఈ చిత్రానికి కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చారు. సినిమాటోగ్రాఫర్ షైజు ఖాలిద్ కేరళ ప్రాంతాలను డార్క్ టోన్‌లో చిత్రీకరించి కథ మూడ్‌ను పూర్తిగా మార్చేశారు.
‘బాలన్: ది బాయ్’ కథ
ఈ మూవీ ఒక తల్లి, కొడుకు చుట్టూ తిరిగే సైకలాజికల్ సర్వైవల్ డ్రామా. కన్నూర్ జైలు (మహిళల కరెక్షనల్ ఫెసిలిటీ) లో జన్మించిన బాలన్ అనే అబ్బాయిని, అతని తల్లి తన గతం నుండి కాపాడుకోవడానికి నిరంతరం ఒక ఊరి నుండి మరో ఊరికి మారుస్తూ ఉంటుంది. సమాజం నుండి, పోలీసుల నుండి తప్పుకోవడానికి ఆమె నిరంతరం తమ పేర్లను, గుర్తింపులను మారుస్తూ, ఈ ప్రపంచంలో ఎవరినీ నమ్మవద్దు అనే ఒకే ఒక సూత్రాన్ని తన కొడుక్కి చిన్నతనం నుంచే నూరిపోస్తుంది. కొంతకాలం పాటు ఒక ప్రశాంతమైన కొండ ప్రాంత గ్రామంలో వీరు జీవితాన్ని సాగించినప్పటికీ, ఊహించని కొన్ని పరిణామాలు ఆ తల్లీకొడుకులను ఒకరికొకరు దూరం చేస్తాయి.
తన తల్లి అకస్మాత్తుగా అదృశ్యం కావడంతో టీనేజ్‌లోకి వచ్చిన బాలన్ ఆమెను వెతికేందుకు చాలా శ్రమస్తాడు. ఆ ప్రయాణంలో అతనికి అబ్బాస్ (టోవినో థామస్) అనే వ్యక్తి పరిచయమై, అతని తల్లిని కనుగొనడంలో సహాయం చేస్తానని ముందుకు వస్తాడు. ఈ క్రమంలో అనేక మలుపులతో స్టోరీ ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరకు ఆ తల్లీకొడుకులు కలుస్తారా ? ఈ మూవీ క్లైమాక్స్ ఏంటి? అనే విషయాలను ఈ సినిమాను చూస్తేనే తెలుస్తుంది.
ఇటీవలి కాలంలో మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. థియేటర్లలో చూడలేకపోయిన వారు ఇప్పుడు జూలై 31 నుంచి జీ5లో తెలుగులో ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం పొందనున్నారు. మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే వారికి ‘బాలన్: ది బాయ్’ ఈ వీకెండ్‌కు బెస్ట్ సజెషన్ గా చెప్పకోవచ్చు.

