NTV Telugu Site icon

Balakrishna: బాలయ్య మొదటి సినిమానే బ్యాన్ చేశారు.. ఎందుకో తెలుసా?

Tatamma Kala

Tatamma Kala

Balakrishna Tatamma Kala Ban Story: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన మొదటి చిత్రం తాతమ్మ కల. ఆ సినిమా ఆగస్టు 30 1974 సంవత్సరంలో రిలీజ్ అయింది. అంటే ఈ రోజుకి సరిగ్గా 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సినిమాకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. కుటుంబ నియంత్రణ విధానాన్ని దేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టిన సమయంలో దానిని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ నిర్మించిన సినిమా ఇది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ 50 రోజులు ఆడిన తర్వాత సినిమాను ఆపేసి చిన్న చిన్న మార్పులతో మళ్ళీ రిలీజ్ చేశారు. రెండుసార్లు సెన్సార్ అయ్యి రెండుసార్లు రిలీజ్ అయిన సినిమా తెలుగులో ఇదొక్కటే. ఈ సినిమాకి నందమూరి తారక రామారావు దర్శకుడు -నిర్మాత – కథకుడు కూడా.

Balakrishna @ 50 Years: జై బాల‌య్య‌ అనకుండా ఉండగలరా!!!

ఈ సినిమాలో ఆయనే రెండు భిన్నమైన పాత్రలు పోషించారు. రమణారెడ్డి, రేలంగి, కాంచన తదితరులు ఇతర ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాలో బాలకృష్ణతో పాటు హరికృష్ణ కూడా నటించారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు నిషేధానికి గురై పార్లమెంట్లో కూడా చర్చకు కారణమైంది. జనాభా ఎక్కువైపోయిన కారణంగా అప్పట్లో కుటుంబ నియంత్రణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సీరియస్గా తీసుకున్నాయి. అందుకే ఇద్దరు ముద్దు ఆపై వద్దు అనే స్లోగన్ తో ప్రచార కార్యక్రమాలు సైతం నిర్వహించేవారు. స్వయంగా సుమారు పదిమంది సంతానం కలిగిన సీనియర్ ఎన్టీఆర్ ఆ విధానం నచ్చక చేసిన సినిమా ఇది. ఎందుకంటే పిల్లలు ఎంతమంది అనేది తల్లిదండ్రుల నిర్ణయం, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను ఆధారంగా చేసుకుని పిల్లలను కనే హక్కు వారికుంది అనేది ఎన్టీఆర్ అభిప్రాయం.

దాని ఆధారంగానే ఈ కథ రాసుకుని 74 మొదట్లో షూటింగ్ మొదలుపెట్టారు. మూడు నెలల్లో షూటింగ్ పూర్తి చేసినా, సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. కథ -కథనాలు, సంభాషణలు సైతం ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతూ సెన్సార్ బోర్డ్ అభ్యంతరం తెలిపింది. కొన్ని నెలల పాటు సినిమా రిలీజ్ కాకుండా బ్యాన్ చేసింది. అయితే ఎన్టీఆర్ మాత్రం వెనక్కి తగ్గకుండా పోరాటం చేసి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకొని ఆగస్టు 30వ తేదీన రిలీజ్ చేశారు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఏ కథ అయితే సెన్సార్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని అభ్యంతరం చెప్పారో అదే కథకు ఎన్టీఆర్ రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. అలా బాలకృష్ణ నటించిన ఈ మొదటి సినిమానే రెండుసార్లు రిలీజ్ అయి రెండుసార్లు సెన్సార్ చేయించుకున్న సినిమాగా రికార్డులకు ఎక్కింది.

Show comments