తెలుగు సినిమా ప్రేక్షకులను, తన ప్రత్యేకమైన తెలంగాణ పంచ్‌లతో అలరించిన నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కమెడియన్‌గాను, విలన్‌గాను పలు చిత్రాల్లో మెప్పించిన వెంకట్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో డయాలసిస్ తీసుకున్న ఆయన ఆరోగ్యం కొంత మెరుగు పడినప్పటికీ, ఇటీవల మళ్లీ క్షీణించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Also Read : Vanitha : నాలుగో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..
ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉండి, అపస్మారక స్థితిలో ఉన్నారు. గుర్తింపు శక్తి సైతం లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్ల ప్రకారం, డయాలసిస్ తాత్కాలిక పరిష్కారమే, శాశ్వతంగా బతికేందుకు కిడ్నీ మార్పిడి అవసరమవుతుందని వెల్లడించారు. అయితే ఈ చికిత్సలు భారీ ఖర్చుతో కూడుకున్నవి గా ఉండటంతో, ఫిష్ వెంకట్ కుటుంబం తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది. ఈ పరిస్థితుల్లో ఆయన భార్య, కుమార్తె ‘దయచేసి మా కుటుంబాన్ని ఆదుకోండి’ అంటూ సినీ ప్రముఖులకు, అభిమానులకు భావోద్వేగంతో విజ్ఞప్తి చేశారు. గతంలో వెంకట్‌కు గాంధీ ఆసుపత్రిలో ఉచిత వైద్యం అందింది. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటారు. ఇప్పుడు పరిస్థితి మరింత విషమించడంతో మళ్లీ సాయం అవసరమైంది.
వెంకట్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న అభిమానులు కలత చెందుతున్నారు. ఆయన గతంలో నటించిన ‘ఆది’ చిత్రంలోని ‘తొడ గొట్టు’ డైలాగ్, అలాగే ‘గబ్బర్ సింగ్’ లో ఇచ్చిన కామెడీ పర్ఫార్మెన్స్ ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. దాదాపు 100కు పైగా చిత్రాల్లో తనదైన శైలితో అలరించిన ఈ నటుడికి ఇప్పుడు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా), ప్రముఖ నటులు అండగా నిలవాలని కోరుతున్నారు.
