Site icon NTV Telugu

Palleturu Movie: యన్టీఆర్ – సావిత్రి జంటగా తొలి చిత్రం ‘పల్లెటూరు’

Palleturu

Palleturu

70 years for ntr and savitri palleturu movie

మహానటుడు నటరత్న యన్.టి.రామారావుకు, మహానటి సావిత్రికి భలేగా ‘చిత్రా’నుబంధం ఉంది. యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘సంసారం’ చిత్రంలోనే తొలిసారి సావిత్రి తెరపై కనిపించారు. యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ‘పాతాళభైరవి’లో “నే రానంటె రానే రాను…” అనే పాటలో కనిపించారు సావిత్రి. ఇక యన్టీఆర్ తో తెరకెక్కిన ‘పెళ్ళిచేసిచూడు’తోనే సావిత్రికి నటిగా మంచి గుర్తింపు లభించింది. ఇక ఆమె యన్టీఆర్ తో తొలిసారి నాయికగా నటించిన ‘పల్లెటూరు’ సినిమా సైతం విశేషాదరణ చూరగొంది. ఈ చిత్రం 1952 అక్టోబర్ 16న విడుదలై విజయకేతనం ఎగురవేసింది. ఈ సినిమాతోనే ప్రముఖ దర్శకులు తాతినేని ప్రకాశరావు దర్శకునిగా పరిచయం అయ్యారు.

ఇక ‘పల్లెటూరు’ కథ ఏమిటంటే – తమ ఊరిలో వారందరినీ చైతన్యవంతులుగా చేసేందుకు చంద్రం కృషి చేస్తుంటాడు. నవీన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేస్తే ఎలాంటి రాబడి ఉంటుందో రైతులకు వివరిస్తుంటాడు. అతనంటే ఆ పల్లెటూరులో ఎంతోమందికి అభిమానం. కానీ, గణపతికి అతను ఓ కొరకరాని కొయ్య! సాంబయ్య అనే రైతు కూతురు సుగుణకు చంద్రం అంటే అభిమానం. వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. గణపతి తన దగ్గర పనిచేసే కొండయ్య భార్య శాంతను బలాత్కారం చేయబోతాడు. ఆమె తప్పించుకుంటుంది. చంద్రంకు శాంత మరదలు వరస అవుతుంది. దాంతో గణపతిపై చంద్రం నిప్పులు చెరుగుతాడు. అది మనసులో ఉంచుకొని, చంద్రంకు, శాంతకు అక్రమ సంబంధం ఉందని పుకారు లేవదీస్తాడు గణపతి. ఆయన మాటంటే వేదవాక్కుగా భావించే కొండయ్య, శాంతను ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. చంద్రంపై ఓ పథకం ప్రకారం నేరం మోపి జైలుకు పంపిస్తాడు గణపతి. అలాగే ఓ కేసులో నిర్దోషి అయిన కొండయ్యను ఇరికిస్తాడు. జైలులో కొండయ్యను చూసిన చంద్రం జరిగిన దంతా వివరించి చెప్పడంతో తన తప్పు తెలుసుకుంటాడు. ఇద్దరూ బయటకు వచ్చాక, గణపతి తప్పుడు చేష్టలను జనం ముందు ఉంచి, వారికి శిక్షపడేలా చేస్తారు. కొండయ్య, భార్య శాంత కలుసుకుంటారు. చంద్రం, సుగుణ పెళ్ళితో కథ సుఖాంతమవుతుంది.

ఇందులో చంద్రంగా యన్టీఆర్, సుగుణగా సావిత్రి నటించారు. గణపతి పాత్రలో యస్వీ రంగారావు నటించగా, రమణారెడ్డి, మిక్కిలినేని, పెరుమాళ్ళు, చదలవాడ, నాగభూషణం, కోడూరి అచ్చయ్య, టి.జి. కమలాదేవి, హేమలత, వసుంధర, శేషమాంబ, పద్మావతి, బేబీ కృష్ణవేణి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఘంటసాల సంగీతం సమకూర్చగా, సుంకర, వాసిరెడ్డి, వేములపల్లి పాటలు పలికించారు. వేములపల్లి శ్రీకృష్ణ రాసిన “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా…” పాట ఇందులో ఉపయోగించుకున్నారు. “వచ్చిందోయ్ సంక్రాంతి…”, “రాజు పేదా…”, “పొలాలనన్నీ హలాల దున్ని…”, “ఆ మనసులోన…”, “అమ్మా సీతమ్మా…”, “దేశ సేవకుల…”, “ఆంధ్రులార లేవరా…”, “దేశ సేవకు…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రాన్ని పీపుల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.శివరామయ్య నిర్మించారు.

‘పల్లెటూరు’ సినిమాకు ముందు రైతుల సమస్యలపై తెరకెక్కిన గూడవల్లి రామబ్రహ్మం ‘రైతుబిడ్డ’ వంటి చిత్రాలు అలరించాయి. ఆ తరువాత ‘పల్లెటూరు’ నేపథ్యంగానే ‘షావుకారు’ తెరకెక్కింది. ఆ చిత్రానికి అసోసియేట్ గా ఎల్.వి.ప్రసాద్ వద్ద పనిచేసిన తాతినేని ప్రకాశరావు ఈ సినిమాకు దర్శకుడు కావడం విశేషం! ఇందులో కథానాయకుని వీరోచితం ప్రధాన పాత్ర పోషించింది. దాంతో ‘పల్లెటూరు’లో ప్రేక్షకులకు కొత్తదనం కనిపించి, ఈ సినిమాను విశేషంగా ఆదరించారు. ఈ చిత్రం తరువాతే దాదాపు రైతుల సమస్యలు, కామందుల చేష్టలతో ‘రోజులు మారాయి’ సినిమా కూడా రూపొంది విజయం సాధించింది. 1952లో ‘పెళ్ళి చేసి చూడు’ బ్లాక్ బస్టర్ గా నిలచింది. ఆ తరువాత అలరించిన చిత్రాలలో ‘పల్లెటూరు’ కూడా చోటు సంపాదించింది. ఈ సినిమా తరువాత యన్టీఆర్- సావిత్రి జంట అనేక చిత్రాలలో నటించి జనాన్ని అలరించారు. ఇందులోని “చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా…” పాటను యన్టీఆర్ తన ఎన్నికల ప్రచారంలో 1982లో వినియోగించుకున్నారు. ఈ పాట రాసిన వేములపల్లి శ్రీకృష్ణ 1983లో మంగళగిరిలో కమ్యూనిస్ట్ అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూడగా, అదే నియోజకవర్గం నుండి తెలుగుదేశం అభ్యర్థి డాక్టర్ ఎమ్మెసెస్ కోటేశ్వరరావు విజయం సాధించడం గురించి అప్పట్లో భలేగా ముచ్చటించుకున్నారు.

Exit mobile version