2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!

2026 Comeback Heros

2026 Comeback Heros

తెలుగు చిత్రసీమలో విజయాలు, ఓటములు అత్యంత సహజం. అయితే కొందరు హీరోలకు వరుస పరాజయాలు ఎదురై కెరీర్ ‘ఫేడౌట్’ దిశగా సాగుతోందన్న వ్యాఖ్యలు వినిపించే తరుణంలో 2026 సంవత్సరం వారందరికీ ఊరటనిచ్చిందనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కాలం కలసిరాక ఇబ్బంది పడుతున్న పలువురు సీనియర్, యంగ్ హీరోలు ఈ ఏడాది మళ్లీ తమ పంజా విసిరారు.

‘ఇరుముడి’తో మాస్‌రాజా రికార్డుల వేట : 

‘ధమాకా’ వంటి భారీ హిట్ తర్వాత వరుసగా 6 ప్లాపులను చూసి తీవ్ర నిరాశలో ఉన్న మాస్ మహారాజా రవితేజకు 2026 తిరుగులేని కంబ్యాక్ ఇచ్చింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రంతో కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడమే కాకుండా రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి మాస్‌రాజా స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది.

‘కొరియన్ కనకరాజు’తో ఫామ్‌లోకి వరుణ్ తేజ్ : 

గత ఏడేళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎట్టకేలకు విజయాల బాట పట్టారు. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ‘కొరియన్ కనకరాజు’ అనే విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ హారర్ కామెడీ చిత్రం వరుణ్ తేజ్‌కు చాలా కాలం తర్వాత సక్సెస్‌ను అందించింది.

10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ‘లెనిన్’తో అఖిల్ స్వస్తి : 

చిత్రసీమలో అడుగుపెట్టి దాదాపు 10 ఏళ్లవుతున్నా సోలో హీరోగా ఇప్పటివరకు ఒక్క సోలో బ్లాక్‌బస్టర్ కూడా సాధించలేకపోయిన అక్కినేని అఖిల్‌కు 2026 కాస్త ఉపశమనాన్నిచ్చింది. ఆయన నటించిన ‘లెనిన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద “ఓకే” అనిపించుకుని, ఆయన కెరీర్‌కు మంచి ఊతాన్నిచ్చింది.

‘రణబాలి’పై విజయ్ దేవరకొండ ఆశలు : 

గత ఎనిమిదేళ్లుగా సరైన సోలో హిట్ లేక డిఫెన్స్‌లో పడ్డ రౌడీ హీరో విజయ్ దేవరకొండ విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రణబాలి’ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో విజయ్ మళ్లీ ఫామ్‌లోకి వస్తాడో లేదో వేచి చూడాలి.

మరోవైపు ప్రస్తుతం వరుస ప్లాపుల్లో ఉన్న నితిన్, శర్వానంద్, నిఖిల్ వంటి నటులు ఈ ఏడాది కాస్త విరామం తీసుకుని తమ తదుపరి చిత్రాలను 2027లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. మొత్తానికి 2026 మాత్రం టాలీవుడ్ ఫేడౌట్ హీరోలకు సరికొత్త ఆశలను, విజయాలను అందించిన సంవత్సరంగా నిలిచింది.