The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్‌కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!

Theodyssey1

Theodyssey1

The Odyssey: క్రిస్టోఫర్ నోలన్ సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి సినిమాను ఒక ఈవెంట్‌గా మలుస్తుంటారు. ఇప్పుడు అదే మ్యాజిక్ మరోసారి పనిచేసింది. హాలీవుడ్ అవైటెడ్ మూవీ ‘ది ఒడిస్సీ’ విడుదలైన తొలి రోజే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుని, నోలన్‌కు భారత్‌లో ఉన్న క్రేజ్‌ను మరోసారి రుజువు చేసింది. హోమర్ రచించిన గ్రీకు ఇతిహాసం ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఫాంటసీ చిత్రం 2026 జులై 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. భారత్‌లో కూడా తెలుగుతో పాటు పలు భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సుమారు 250 మిలియన్ డాలర్లు, అంటే భారత కరెన్సీలో రూ.2000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది.

విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో ఐమ్యాక్స్ షోల టికెట్లు చాలా రోజుల ముందే హౌస్‌ఫుల్ అయ్యాయి. భారతీయ ప్రేక్షకులు ఈ సినిమాను ఐమ్యాక్స్‌లోనే చూడాలని ఆసక్తి చూపడంతో ప్రీమియం ఫార్మాట్లకు భారీ డిమాండ్ కనిపించింది. ఈ ప్రభావం తొలి రోజు వసూళ్లపై కూడా స్పష్టంగా కనిపించింది. అందుతున్న సమాచారం ప్రకారం ‘ది ఒడిస్సీ’ భారతదేశంలో తొలి రోజే రూ.23 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ బ్రాండ్‌పై వచ్చిన వసూళ్లుగా ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే మార్వెల్, అవతార్ సిరీస్ ల క్రేజ్ లా కాకుండా పూర్తిగా నోలన్ పేరిట ఈ వసూళ్లు వచ్చాయని చెప్పవచ్చు.

గత కొన్నేళ్లుగా భారత్ నోలన్‌కు అత్యంత బలమైన విదేశీ మార్కెట్లలో ఒకటిగా నిలుస్తోంది. ‘ఇంటర్‌స్టెల్లార్’, ‘డంకిర్క్’, ‘టెనెట్’, ‘ఓపెన్‌హైమర్’ వంటి చిత్రాలు భారత బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధించాయి. ఈసారి నోలన్ తన మూవీని ముంబైలో ప్రమోట్ చేసుకోవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సినిమాలో మాట్ డామన్ ప్రధాన పాత్రలో నటించగా, టామ్ హాలండ్, అన్నీ హాత్వే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్, లుపిటా న్యోంగో వంటి హాలీవుడ్ స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ట్రోజన్ యుద్ధం అనంతరం రాజు ఒడిస్సియస్ చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథ తెరకెక్కింది. మరో ప్రత్యేకత ఏమిటంటే, ప్రపంచ సినీ చరిత్రలో పూర్తిస్థాయిలో ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్గా కూడా ‘ది ఒడిస్సీ’ నిలిచింది.

తొలి రోజు నుంచే ‘ది ఒడిస్సీ’కి భారీ స్పందన లభించడంతో ఈ సినిమా వారాంతంలో మరిన్ని వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐమ్యాక్స్ స్క్రీన్లలో కొనసాగుతున్న భారీ డిమాండ్, నోలన్‌పై ఉన్న ఆదరణను చూస్తుంటే, ‘ది ఒడిస్సీ’ భారత బాక్సాఫీస్ వద్ద మరో హాలీవుడ్ సంచలనంగా నిలిచే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.