మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #Chiru158 చిత్రం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో షూటింగ్ కొనసాగుతోంది. ‘వాల్తేర్ వీరయ్య’ సక్సెస్ తర్వాత మళ్లీ కలిసి పని చేస్తున్న ఈ బిగ్ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను వెంకట్ కె. నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో ఒక భారీ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఈ సీక్వెన్స్ భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది ఫైటర్లతో, భారీ సెట్‌పై షూట్ చేస్తున్న ఈ సీన్‌లో చిరంజీవి పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ స్వయంగా రిస్కీ స్టంట్లు చేస్తూ షూటింగ్‌లో చురుకుగా పాల్గొంటున్నారు. ఈ సినిమా ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను సృష్టించింది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వెంకట్ కె. నారాయణ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, కమర్షియల్ అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. చిరంజీవికి జోడీగా యువ నటి అనస్వర రాజన్ నటిస్తుండటం ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సంగీతాన్ని థమన్ ఎస్ అందిస్తుండగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను విజయ్ కార్తిక్ కన్నన్ నిర్వహిస్తున్నారు. ఎడిటర్‌గా ఆంటోనీ రూబెన్, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా పనిచేస్తున్నారు. కథనం, స్క్రీన్‌ప్లేను కొన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి రూపొందించగా, డైలాగ్స్‌ను భాను–నందు రాస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ టీజర్‌ను త్వరలో విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే #Chiru158 పేరుతో సోషల్ మీడియాలో భారీ చర్చ జరుగుతుండగా, అధికారిక టైటిల్ ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘వాల్తేర్ వీరయ్య’ తర్వాత మరోసారి బాబీ కొల్లి మెగాస్టార్‌ను ఏ స్థాయిలో మాస్‌గా చూపించబోతున్నారన్న ఉత్కంఠ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది.

