మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు, మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అకాల మరణం రాజకీయ, సినీ వర్గాలను కలచి వేసింది. ఈ రోజు ఉదయం అనారోగ్యం కారణంగా మృతి చెందిన రోశయ్యకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్, టిపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వంటి పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. తాజాగా సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా రోశయ్య మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి రోశయ్య మరణంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది అంటూ ట్వీట్ చేశారు.
Read Also : అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
“మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గారి మృతి తీరని విషాదం. ఆయన రాజకీయాలలో భీష్మాచారుడి వంటి వారు. ప్రజా జీవితంలో రోశయ్య ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు, అత్యున్నత సంప్రదాయాలు కాపాడడంలో ఆ ఓ రుషిలా సేవ చేశారు. వివాదరహితులుగా, నిష్కలింకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశయ్య గారు. ఆయన కన్నుమూయడంతో రాజకీయాలలో ఓ శకం ముగిసింది. రోశయ్య గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అంటూ ట్వీట్ చేసి చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు.
గత కొంత కాలం నుంచి నడవలేని స్థితిలో ఈరోజు ఉదయం 6:30 సమయంలో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. నోటి నుంచి రక్తం రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రేపు ఒంటి గంటకు మహా ప్రస్థానంలో రోశయ్య అంత్యక్రియలు జరగనున్నాయి. ఆస్పత్రి నుంచి ఇంటికి రోశయ్య పార్థివదేహం తరలిస్తున్నారు. రేపు ఉదయం 11 గంటల తర్వాత గాంధీ భవన్ కు రోశయ్య పార్థివదేహం తీసుకెళ్తారు.
