ప్రముఖ దర్శక నిర్మాత ప్రకాశ్ ఝా ప్రస్తుతం ‘ఆశ్రమ్’ పేరుతో ఓ వెబ్ సీరిస్ తీస్తున్నారు. బాబీ డియోల్ కీలక పాత్ర పోషించిన ఈ వెబ్ సీరిస్ తొలి రెండు సీజన్స్ ఇప్పటికే ఎం.ఎక్స్. ప్లేయర్ లో స్ట్రీమింగ్ అయ్యాయి. ఈ ‘ఆశ్రమ్’ వెబ్ సీరిస్ లో బాబీ డియోల్ ఓ మోసకారి బాబా పాత్రను పోషిస్తుండటం విశేషం. ఈ వెబ్ సీరిస్ కథాంశం, బాబీ డియోల్ పోషిస్తున్న బాబా నిరాల పాత్ర హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని గతంలో కొన్ని రాష్ట్రాలలో హిందూ సంస్థలు కేసులు పెట్టాయి. అలానే ఎస్.సి., ఎస్టీ వర్గాలు కించపరిచే విధంగా ఈ వెబ్ సీరిస్ ఉందని కూడా కొందరు కోర్టులను ఆశ్రయించాయి.
తాజాగా ఈ వెబ్ సీరిస్ మూడో సీజన్ కు సంబంధించిన షూటింగ్ ను ఇటీవల భోపాల్ లో ప్రకాశ్ ఝా ప్రారంభించారు. దాంతో స్థానిక భజరంగ్ దళ్ కార్యకర్తలు షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి ‘ప్రకాశ్ ఝా ముర్దాబాద్, బాబీ డియోల్ ముర్దాబాద్’ అంటూ నినాదాలు చేశారు. అంతలోనే ఈ నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారిపోయింది. కొందరు కార్యకర్తలు షూటింగ్ నిమిత్తం తీసుకొచ్చిన బస్సు అద్దాలను పగలకొట్టారని, షూటింగ్ సామగ్రిని ధ్వంసం చేశారని తెలిసింది. ఈ సంఘటనలో ఓ వ్యక్తి గాయపడగా, దర్శకుడు ప్రకాశ్ ఝా పై కొందరు ఇంకు ఒలకబోసారని అంటున్నారు. ఈ దాడిని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఖండించింది. అలానే ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ కూడా ఈ చర్యలను విమర్శించింది. గత కొంతకాలంగా సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు చిత్ర ప్రదర్శన సమయంలో థియేటర్ల మీద కూడా కొందరు దాడి చేస్తున్నారని, ఇలాంటి వ్యక్తులను తీవ్రంగా శిక్షించాలని కోరింది. ఈ విషయమై దక్షిణ భోపాల్ ఎస్పీ సాయికృష్ణ తోట మాట్లాడుతూ, ‘వెబ్ సీరిస్ షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు అక్కడకు వెళ్ళి అభ్యంతరం వ్యక్తం చేశారు. అలానే నిరసన తెలిపారు. భజరంగ్ దళ్ కు చెందిన కార్యకర్తలు ఈ వెబ్ సీరిస్ కథాంశం హిందువుల మనో భావాలు దెబ్బతీసే విధంగా ఉందని అన్నారు. అక్కడ జరిగిన దాడిలో రెండు బస్సుల అద్దాలు దెబ్బతిన్నాయి. అయితే ఇంతవరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు” అని చెప్పారు. ప్రకాశ్ ఝా పై జరిగిన దాడిని సినీ ప్రముఖులు హన్సలాల్ మెహతా, సంజయ్ గుప్తా, ప్రీతీష్ నంది, సుధీర్ మిశ్రా తదితరులు ఖండించారు.
