Boycott Alia Bhatt Trending In India: ఏదైనా ఒక విషయంపై సెలెబ్రిటీలు వ్యక్తపరిచే అభిప్రాయాలు అందరికీ నచ్చవు. కొందరికీ నచ్చితే, మరికొందరికీ మాత్రం అందులో చాలా తప్పులు కనిపిస్తాయి. అలాంటప్పుడు వాళ్లు సోషల్ మీడియాలోకి వచ్చి, ఫలానా సెలెబ్రిటీకి వ్యతిరేకంగా ట్రెండ్ చేయడం మొదలుపెట్టేస్తారు. ఇప్పుడు ఆలియా భట్ విషయంలో అదే జరుగుతోంది. ఈమెను బ్యాన్ చేయాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా నెపోటిజం విషయంలో ఆలియాను బహిష్కరించాలంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఇప్పుడు ‘డార్లింగ్స్’ సినిమా విషయంలో ఆమెను ఈ సెగ తగిలింది. ఆ సినిమా మగాళ్లపై గృహహింసని ప్రోత్సాహించేలా ఉందని, అందులో నటించినందుకు ఆలియాని బ్యాన్ చేయాల్సిందేనని పట్టుబడుతున్నారు.
అఫ్‌కోర్స్.. మగాళ్లపై గృహహింసని ప్రోత్సాహించడం అనేది ముమ్మాటికీ తప్పే. కానీ, ఇక్కడ సినిమా సబ్జెక్ట్ కేవలం మగాళ్లని టార్చర్ పెట్టడమే కాదు. ఎవరైతే తమ భార్యలను చిన్న చిన్న విషయాలకి కూడా టార్చర్ పెడతారో, అలాంటి వాళ్లకి బుద్ధి చెప్పేందుకే ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తనని భర్త ఎలా హింసించాడో, అలాగే ఆలియా భట్ తన భర్తని వేధిస్తుంది. అది మనం ట్రైలర్‌లో గమనించవచ్చు. ఇంట్లో నుంచి వెళ్లిపోయాడంటూ తప్పుడు కేసు పెట్టి, తన తల్లితో కలిసి భర్తని తనే కిడ్నాప్ చేసి, అతడ్ని టార్చర్ పెడుతుంటుంది ఆలియా. చంపమని తల్లి చెప్తే, తానలా చేయనని.. తనని ఎలాగైతే ట్రీట్ చేశాడో, అలాగే అతనితో ఫుట్‌బాల్ ఆడుకుంటానంటూ హింసిస్తుంది. అయితే.. ఈ సబ్జెక్ట్ అర్థం కాని కొందరు నెటిజన్స్, ఆలియాని బ్యాట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో చూడాలి.