Birthday wishes to Sai Kumar
డైలాగ్ కింగ్ సాయికుమార్ బాల్యంలోని వెండితెరపై బాలనటుడిగా మెరిసాడు. తండ్రి పీజే శర్మ నుండి గాత్రాన్ని, నటనను కూడా వారసత్వంగా అందిపుచ్చుకున్నాడు. యాభై యేళ్ళ నట ప్రస్థానంలో ఎక్కడా అలిసింది లేదు.. సొలసింది లేదు! అందుకే ఇవాళ్టికీ తెలుగు, తమిళ, కన్నడ భాషా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. విశేషం ఏమంటే… ఈ మూడు భాషల్లోనూ సాయికుమార్ భిన్నమైన ఇమేజ్ తో ముందుకు పోతున్నారు. సాయికుమార్ నటించిన ‘ఎస్.ఆర్. కళ్యాణ్ మండపం’ మూవీ ఈ మధ్యకాలంలో మంచిపేరు తెచ్చిపెట్టింది. అలానే ‘గాలివాన’ వెబ్ సీరిస్ లోనూ చక్కని నటన కనబరిచి మెప్పించారు. ఇక ఈ రోజు డైలాగ్ కింగ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న సినిమాల దర్శక నిర్మాతలు పోస్టర్స్ తో సోషల్ మీడియాలో సునామీ సృష్టించారు. సాయికుమార్ నటిస్తున్న ‘సార్’, ‘అరి’, ‘నాతో నేను’, ‘జోరుగా హుషారుగా’, ‘ఫుల్ బాటిల్’ వంటి తెలుగు సినిమాల టీమ్స్ విషెస్ తెలిపాయి.
అలానే తమిళ చిత్రం ‘డీజిల్’, కన్నడ చిత్రాలు ‘రాక్షసుడు, వాసంతి, రౌడీ, అవతార పురుష, ఘర్ణా’ చిత్రాల బృందాలు సైతం తమ అభిమాన నటుడికి శుభాకాంక్షలు తెలిపాయి. అలానే ఇంకా పేరు నిర్ణయించని పలు చిత్రాలలోనూ సాయికుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆ ప్రొడక్షన్ హౌసెస్ సైతం ఆయనకు విషెస్ చెప్పాయి. విశేషం ఏమంటే… కన్నడ చిత్రం ‘మేడిన్ బెంగళూరు’లో సాయికుమార్ రెడ్డి అనే పూర్తి నెగెటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ అండర్ వరల్డ్ డాన్ కు సంబంధించిన స్పెషల్ టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు. మొత్తం మీద సాయికుమార్ రాబోయే రోజుల్లో విశేషమైన పాత్రలతో అందరినీ మరోసారి అలరించబోతున్నాడు!
