Pinaki Chaudhuri: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. దేశం మొత్తం దీపావళీ పండుగ చేసుకుంటుండగా బెంగాలీ ఇండస్ట్రీలో మాత్రం విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రముఖ బెంగాలీ దర్శకుడు, రెండుసార్లు ఉత్తమ దర్శకుడుగా అవార్డు అందుకున్న పినాకీ చౌదరి కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం కలకత్తాలోని తన నివాసంలో కన్నుమూశారు. కొన్నేళ్లుగా పినాకీ లింఫోమా, శోషరస వ్యవస్థ క్యాన్సర్ తో పోరాడుతున్నారు.
ఒక నెల క్రితం వరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన చివరి కోరికగా ఇంట్లోనే ఉండాలని కోరడంతో వైద్యుల సూచనతో కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. ఇక సోమవారం ఆయన పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. 1983లో సౌమిత్ర ఛటర్జీ, అమోల్ పాలేకర్, తనూజ, ఛాయాదేవి తదితరులు నటించిన ‘చెనా అచ్చెనా’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. ఇక 1996లో ‘షాంఘాత్’, 2007లో ‘బాలీగంజ్ కోర్ట్’ చిత్రాలకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక పినాకీకు భార్య, కొడుకు ఉన్నారు. పినాకీ మరణవార్త విన్న పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.