Site icon NTV Telugu

Babu Jagjivan Ram: ‘బాబూజీ’గా జగజ్జీవన్ రామ్ బయోపిక్!

Babu

Babu

Babu Jagjivan Ram: మాజీ ఉప ప్రధాని, స్వర్గీయ బాబూ జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు దిలీప్ రాజా. గతంలో అంబేడ్కర్ జీవిత చరిత్రను చిత్రీకరించిన ఆయన ప్రస్తుతం ‘బాబూజీ’ పేరుతో గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో ఈ బయోపిక్ ను రూపొందిస్తున్నారు. మాజీ ఐఎయస్ అధికారి డాక్టర్ బి. రామాంజనేయులు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లిడ్ కాప్ అధ్యక్షులు కాకుమాను రాజ శేఖర్ కెమేరా స్విచ్ ఆన్ చేశారు.

జగజ్జీవన్ రామ్ కుమార్తె, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పాత్రను సీనియర్ నటి తాళ్లూరి రామేశ్వరి పోషిస్తుండగా టైటిల్ రోల్ ను మిలటరీ ప్రసాద్ చేస్తున్నట్లు దర్శకుడు దిలీప్ రాజా వివరించారు. స్వాతంత్ర ఉద్యమంలో మహాత్మా గాంధీజీ అనుచరుడిగా బాబూ జగజ్జీవన్ రామ్ సత్యాగ్రహల్లో పాల్గొని బ్రిటీష్ జైళ్లల్లో గడిపిన రోజుల్లో జరిగిన సంఘటనలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నామని, ఇందులో సుభాష్ చంద్ర బోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, మాలవీయ, జవహర్ లాల్ నెహ్రూ, బాబూ రాజేంద్ర ప్రసాద్, భగత్ సింగ్ , ఇందిరా గాంధీ పాత్రలు కీలకంగా వుంటాయని దర్శకుడు చెప్పారు. రెండవ షెడ్యూలును బీహార్ లోని చాంద్వ గ్రామంలో చిత్రీకించనున్నట్లు తెలిపారు. జగజ్జీవన్ రామ్ రక్షణ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో భారత్ – పాకిస్తాన్ ల మధ్య జరిగిన యుద్ధం సన్నివేశాలను కాశ్మీర్ బోర్డర్ లో చిత్రీకరిస్తామని, ఇందుకోసం అక్కడి అధికారుల అనుమతి కోరినట్లు చెప్పారు. పసుపులేటి నాగేశ్వర రావు, మహమ్మద్ రహంతుల్లా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం దిలీప్ రాజా.

Exit mobile version