Site icon NTV Telugu

Atluri Pundarikakshaiah Jayanthi : నటనిర్మాత అట్లూరి పుండరీకాక్షయ్య!

Pudarikasha Jayanti

Pudarikasha Jayanti

Atluri Pundarikakshaiah Jayanthi :  నటరత్న యన్టీఆర్ తనను నమ్ముకున్నవారిని సదా చేరదీస్తూ ఉండేవారని ప్రతీతి. ఆయన విజయవాడలో చదువుకొనే రోజుల్లో అట్లూరి పుండరీకాక్షయ్యతో పరిచయం ఏర్పడింది. యన్టీఆర్ ను పుండరీకాక్షయ్య ‘బావా’ అంటూ అభిమానంగా పిలిచేవారు. నాటకరంగంలోనూ తనదైన బాణీ పలికించిన పుండరీకాక్షయ్య చిత్రసీమలో యన్టీఆర్ నీడన నిర్మాతగా నిలిచారు. ఆ నాటి చిత్రసీమ ప్రముఖుల్లో ఒకరిగా పుండరీకాక్షయ్య తనదైన బాణీ పలికించారు. పుండరీకాక్షయ్య పేరు చెప్పగానే యన్టీఆర్ తో ఆయన నిర్మించిన అనేక విజయవంతమైన చిత్రాలు గుర్తుకు వస్తాయి. పంపిణీదారునిగానూ పుండరీకాక్షయ్య రాణించారు. అన్నిటా తన ‘బావ’ యన్టీఆర్ అండదండలే తనను నడిపించాయని చెప్పుకొనేవారు పుండరీకాక్షయ్య.

కృష్ణాజిల్లా కైకలూరు సమీపంలోని కలవపూడిలో 1925 ఆగస్టు 19న అట్లూరి పుండరీకాక్షయ్య జన్మించారు. కొంతకాలం సొంతవూరులోనే జీవనం సాగింది. ఆయన తండ్రి బెజవాడ మకాం మార్చడంతో ఎనిమిదవ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పారు పుండరీకాక్షయ్య. ఆ రోజుల్లో తెరకెక్కిన ‘ప్రహ్లాద’ చిత్రంలో చిన్న వేషం వేశారు. మళ్ళీ బెజవాడ వచ్చి తండ్రి వద్ద పనిచేస్తూనే నాటకాలు వేసేవారు. మేనమామ మిల్లులో అకౌంట్స్ చూసే పనిలో కుదురుకున్నారు. అయినా నాటకాలపై మక్కువ తగ్గలేదు. నందమూరి వారి కుటుంబంతో పుండరీకాక్షయ్య కన్నవారికి మంచి అనుబంధం ఉంది. యన్టీఆర్ బెజవాడలో చదువుకొనే రోజుల్లో పుండరీకాక్షయ్య వాళ్ళ ఇంట్లోనే టిఫిన్ క్యారియర్ పెట్టుకొనేవారు. సాయంత్రం దాకా అక్కడే కాలక్షేపం చేసి, తరువాత ట్రైన్ కు గుడివాడ వెళ్ళేవారు రామారావు. తరువాతి రోజుల్లో యన్టీఆర్ ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ అనే నాటక సంస్థను స్థాపించి, దాని ద్వారా నాటకాలు వేసేవారు. అందులో ఆయన సహవిద్యార్థి అయిన జగ్గయ్య కూడా నటించేవారు. పుండరీకాక్షయ్య కూడా తనకు తగ్గ వేషాలు వేసి అలరించేవారు. యన్టీఆర్ సినిమాల్లో ప్రవేశించిన తరువాత ఆయన తమ్ముడు త్రివిక్రమరావుతో కలసి కొంతకాలం నేషనల్ ఆర్ట్ థియేటర్స్ నాటక సంస్థను నడిపారు పుండరీకాక్షయ్య. యన్టీఆర్ పిలుపుతో త్రివిక్రమరావు, పుండరీకాక్షయ్య ఇద్దరూ చిత్రసీమకు వెళ్ళారు.

సినిమా రంగంలోనూ తమ ‘నేషనల్ ఆర్ట్ థియేటర్స్’ బ్యానర్ పైనే యన్టీఆర్ సొంత చిత్రాలు నిర్మించసాగారు. యన్.ఏ.టి. పతాకంపై రామారావు తన సోదరుడు త్రివిక్రమరావు నిర్మాతగా ‘పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు’ నిర్మించి, వాటిలో అభ్యుదయభావాలు ప్రవేశ పెట్టి చేతులు కాల్చుకున్నారు. తరువాత జానపద చిత్రం ‘జయసింహ’ను భారీగా నిర్మించారు. ఈ చిత్ర నిర్మాణంలో డి.వి.ఎస్.రాజు కూడా పాలుపంచుకున్నారు. ఇక నిర్మాణ వ్యవహారాలన్నీ త్రివిక్రమరావుతో కలసి పుండరీకాక్షయ్య చూసుకొనేవారు. ‘జయసింహ’ ఘనవిజయం సాధించడంతో యన్.ఏ.టి. సంస్థ జనాల్లో మంచి పేరు సంపాదించింది. ఆ తరువాత ఆ బ్యానర్ లో “పాండురంగ మహాత్మ్యం, సీతారామకళ్యాణం, గులేబకావళి కథ, శ్రీక్రిష్ణ పాండవీయం, వరకట్నం, తల్లా-పెళ్ళామా” వంటి జనరంజక చిత్రాలు రూపొందాయి. వీటన్నిటికీ త్రివిక్రమరావుకు చేదోడు వాదోడుగా ఉన్నారు పుండరీకాక్షయ్య. ఈ చిత్రాల నిర్మాణం ఒకవైపు సాగుతూ ఉండగానే ‘స్వస్తిశ్రీ’ పతాకంపై విజయాధినేత బి.నాగిరెడ్డి నిర్మాణ భాగస్వామిగా ‘రేచుక్క-పగటిచుక్క’ నిర్మించారు త్రివిక్రమరావు. ఈ సినిమా నిర్మాణంలోనూ పుండరీకాక్షయ్య పాత్ర ఎంతో ఉంది. ఇలా రామారావు సొంత చిత్రాల నిర్మాణవ్యవహారాల్లో కీలక పాత్ర పోషించిన పుండరీకాక్షయ్యను యన్టీఆర్ తరువాత నిర్మాతగా నిలిపారు.

యన్టీఆర్ నటించిన ‘మహామంత్రి తిమ్మరుసు’ చిత్రానికి ఎన్.రామబ్రహ్మం నిర్మాత. ఆయనకు భాగస్వామిగా పుండరీకాక్షయ్యను చేశారు యన్టీఆర్. ఆ సినిమా మంచి లాభాలు చూపింది. ఆ తరువాత కనకమేడల తిరుపతయ్య నిర్మాణ భాగస్వామిగా పుండరీకాక్షయ్య నిర్మాణంలో యన్టీఆర్ తో ‘శ్రీకృష్ణావతారం’ రూపొందింది. ఈ రెండు చిత్రాలకు కమలాకర కామేశ్వరరావు దర్శకులు. ‘శ్రీకృష్ణావతారం’ కోసం తిరుపతి వేంకటకవులు రాసిన ‘శ్రీకృష్ణరాయబారం’లోని పద్యాల హక్కులను తీసుకున్నారు పుండరీకాక్షయ్య. అప్పటికే తెలుగునేలపై విశేషాదరణ చూరగొన్న ఆ పద్యాలు ఘంటసాల గళంలో మరోమారు అలరించాయి. ఈ హక్కులతోనే తరువాతి రోజుల్లో యన్టీఆర్ తన ‘శ్రీకృష్ణ సత్య, దానవీరశూర కర్ణ’లో తిరుపతి వేంకటకవుల పద్యాలు వినిపించి, ప్రతి చిత్రంలోనూ శ్రీకృష్ణునిగా తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ‘శ్రీకృష్ణావతారం’ ఘనవిజయం సాధించింది. ఆ తరువాత హిందీ చిత్రం ‘చీనా టౌన్’ ఆధారంగా యన్టీఆర్ తో ‘భలే తమ్ముడు’ నిర్మించారు పుండరీకాక్షయ్య. ఈ చిత్రం ద్వారా మహ్మద్ రఫీ గళం తెలుగునేలపై విశేషాదరణ చూరగొంది. తరువాత రామారావు హీరోగా ‘మనుషుల్లో దేవుడు’ నిర్మించారు. ఇందులో కలర్ లో కనిపించే ‘వరూధినీ ప్రవరాఖ్య నాటకం’ అలరించింది. ఈ చిత్రం కూడా మంచివిజయం సాధించింది. ఆ పై హిందీలో విజయం సాధించిన ‘గీత్’ ఆధారంగా యన్టీఆర్ తో ‘ఆరాధన’ నిర్మించారు పుండరీకాక్షయ్య. ఇందులో మరోమారు మహమ్మద్ రఫీ గానం ఎంతగానో అలరించింది. 1976వ సంవత్సరం బ్లాక్ బస్టర్ గా ‘ఆరాధన’ నిలచింది. పుండరీకాక్షయ్య ‘మేలుకొలుపు’లో రామారావు అతిథి పాత్రలో నటించారు. ఆ తరువాత యన్టీఆర్ తో ‘మావారి మంచితనం’ అనే సినిమా నిర్మించారు పుండరీకాక్షయ్య.

అప్పటి దాకా నిర్మాతగా సాగిన పుండరీకాక్షయ్య ‘కర్తవ్యం’ చిత్రంలో విలన్ ముద్దు క్రిష్ణయ్య పాత్ర పోషించి మెప్పించారు. విజయశాంతి కెరీర్ లో ఓ మైలురాయిగా నిలచిందీ చిత్రం. ఈ సినిమా తరువాత పుండరీకాక్షయ్యకు నటునిగా కొన్ని అవకాశాలు లభించాయి. “మామ-కోడలు, పోలీస్ బ్రదర్స్, బ్రహ్మ, శివయ్య” వంటి చిత్రాలలోనూ, కొన్ని కన్నడ సినిమాల్లోనూ నటించారు పుండరీకాక్షయ్య. ఆయన నటించిన ‘రాఘవయ్య గారి అబ్బాయి’ చివరగా విడుదలయింది. 2012 ఫిబ్రవరి 2న పుండరీకాక్షయ్య కన్నుమూశారు. ఏది ఏమైనా నిర్మాతగా, నటునిగా చిత్రసీమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించారు అట్లూరి పుండరీకాక్షయ్య.

Exit mobile version