ప్రస్తుత తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, ఏషియన్ గ్రూప్ ఆఫ్ థియేటర్స్ అధినేత, గ్లోబల్ సినిమాస్ ఛైర్మన్, నిర్మాత, పంపిణీదారుడు, ఫైనాన్షియర్ నారాయణదాస్ నారంగ్ ఏప్రియల్ 19 (మంగళవారం) ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న నారాయణ దాస్ కె నారంగ్ ఓ ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 78 సంవత్సరాలు. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ‘లవ్ స్టొరీ, లక్ష్య’ వంటి సినిమాలను నిర్మించిన నారాయణదాస్ కె నారంగ్ ప్రస్తుతం నాగార్జున హీరోగా ‘ఘోస్ట్’, ధనుష్ తో ద్విభాషా చిత్రాన్ని, శివకార్తికేయన్- అనుదీప్ మూవీ, సుధీర్ బాబు హీరోగా హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ మూవీ… మొత్తం నాలుగు సినిమాలు చేస్తున్నారు. నైజాం ఏరియాలో తొలి తరం పంపిణీదారులలో నారాయణ దాస్ కె నారంగ్ ఒకరు. ఆపై ఎగ్జిబిటర్ గా, ఫైనాన్షియర్ గా తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు. ఆయనకు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ ఇద్దరు కుమారులు. వారిలోని సునీల్ నారంగ్ చిత్రపరిశ్రమలో పలు శాఖలలో యాక్టీవ్ గా ఉంటున్నారు. నారాయణదాస్ నారంగ్ పార్ధివ దేహాన్ని 12 గంటలకు సందర్శకుల కోసం జూబ్లీహిల్స్ లోని వారి ఇంటికి తీసుకురానున్నారు. సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు నారాయణ దాస్ నారంగ్ మృతిపట్ల సంతాపం తెలిపారు.
Read Also : Antha Mana Manchike Movie : యాభై ఏళ్ళ ‘అంతా మన మంచికే’