ప్రముఖ వ్యాపారవేత్త, నిర్మాత అంబికా కృష్ణ తెలుగు దేశం పార్టీని వీడి మూడేళ్ళ క్రితమే బీజేపీలో చేరారు. నిర్మాతగానే కాకుండా, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఎఫ్.డి.సీ. చైర్మన్ గానూ సేవలు అందించిన అంబికా కృష్ణ మీద బీజేపీ బాగానే ఆశలు పెట్టుకుంది. ఇటీవల ప్రధాని మోదీ భీమవరం పర్యటించిన సమయంలో అది నిజమేనని రుజువైంది. అల్లూరి సీతారామరాజు 125 జయంతి సందర్భంగా కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ లో భాగంగా జరిగిన ఈ వేడుకకు హైదరాబాద్ నుండి చిరంజీవి సైతం హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో అంబికా కృష్ణకూ విశేష ప్రాధాన్యం లభించింది.
ప్రధాని మోదీ భీమవరంలో హెలికాఫ్టర్ దిగినప్పుడు కేవలం 8మందిని మాత్రమే హెలిప్యాడ్ కు అనుమతించారు. వారిలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ తో పాటు అంబికా కృష్ణ కూడా ఉన్నారు. మోదీని హెలిప్యాడ్ వద్ద ఆహ్వానించిన అంబికా కృష్ణకు రాబోయే రోజుల్లో ఆ పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. గతంలో ఏలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచిన అంబికా కృష్ణ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి బీజేపీ తరఫున పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద మోదీ పర్యటన సందర్భంగా అంబికా పరిమళాలు బాగానే గుబాళించాయన్నది స్థానికుల మాట.
