NTV Telugu Site icon

Akkineni Sreekar Prasad : మన తెలుగువాడే ఘనుడు!

A Sreekar Prasad

A Sreekar Prasad

Akkineni Sreekar Prasad  Our Telugu genius:

ఈ సారి జాతీయ స్థాయిలో ప్రముఖ ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్ తొమ్మిదో నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఎడిటింగ్ విభాగంలో ఇన్ని అవార్డులు దక్కించుకున్న ఏకైక కూర్పరిగా శ్రీకర్ ప్రసాద్ చరిత్ర సృష్టించారు. శ్రీకర్ ప్రసాద్ మన తెలుగువారు. విఖ్యాత దర్శకనిర్మాత ఎల్.వి.ప్రసాద్ తమ్ముడైన దర్శకనిర్మాత, ఎడిటర్ అక్కినేని సంజీవి తనయుడే శ్రీకర్ ప్రసాద్. 1988లో మొట్టమొదటి సారి ‘రాఖ్’ అనే హిందీ చిత్రం ద్వారా శ్రీకర్ ప్రసాద్ బెస్ట్ ఎడిటర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత 1996లో అస్సామీ చిత్రం ‘రాగ్ బైరాగ్’తోనూ బెస్ట్ ఎడిటర్ గా జాతీయ అవార్డు సొంతం చేసుకున్నారాయన. మరో విశేషమేమిటంటే 1996లో నాన్ ఫీచర్ ఫిలిమ్ ‘నౌకాచరిత్రం’ ఇంగ్లిష్ మూవీ ద్వారా కూడా ఆయన బెస్ట్ ఎడిటర్ గా ఎన్నికయ్యారు. ఒకే ఏడాది ఫీచర్ ఫిలిమ్, నాన్ ఫీచర్ ఫిలిమ్ రెండు కేటగిరీల్లోనూ ఆయన ఉత్తమ కూర్పరిగా జాతీయ అవార్డును అందుకోవడం విశేషం. ఆ మరుసటి సంవత్సరమే అంటే 1997లో తమిళ చిత్రం ‘ద టెర్రరిస్ట్’తోనూ జాతీయ స్థాయిలో ఉత్తమ కూర్పరిగా నిలిచారు శ్రీకర్ ప్రసాద్. 1999లో మళయాళీ చిత్రం ‘వానప్రస్తం’తోనూ బెస్ట్ఎడిటర్ గా నేషనల్ అవార్డు సొంతం చేసుకున్నారాయన.

తరువాత 2002లో మణిరత్నం తెరకెక్కించిన ‘కణ్ణత్తిల్ ముత్తమిట్టాల్’ (తెలుగులో ‘అమృత’) ద్వారా మరో నేషనల్ అవార్డ్ శ్రీకర్ ప్రసాద్ సొంతమయింది. 2008లో హిందీ చిత్రం ‘ఫిరాఖ్’తోనూ మరోమారు బెస్ట్ ఎడిటర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పై దాదాపు 12 ఏళ్ళకు 2020 సంవత్సరానికి గాను ఇప్పుడు తమిళ చిత్రం ‘శివరంజనియుమ్ ఇన్నుమ్ సిల పెంగలుమ్’తో మరో మారు ఫీచర్ ఫిలిమ్ విభాగంలో బెస్ట్ ఎడిటర్ గా ఎన్నికయ్యారు.
మధ్యలో 2010లో “కుట్టీ శ్రాంక్ (మళయాళం), కమీనే (హిందీ), కేరళవర్మ పలస్సీ రాజా (మళయాళం)” చిత్రాల ద్వారా బెస్ట్ ఎడిటర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డునూ సొంతం చేసుకున్నారు. ఇలా ఏడు సార్లు ఫీచర్ ఫిలిమ్ విభాగంలోనూ, ఓ సారి నాన్ ఫీచర్ కేటగిరీలోనూ, మరోసారి స్పెషల్ జ్యూరీ అవార్డునూ సొంతం చేసుకొని మొత్తం ఎడిటింగ్ విభాగంలో తొమ్మిది సార్లు బెస్ట్ అనిపించుకున్న ఘనత మన శ్రీకర్ ప్రసాద్ కే దక్కింది. గమ్మత్తేమిటంటే, తెలుగువారయిన శ్రీకర్ ప్రసాద్ బెస్ట్ ఎడిటర్ గా ఇప్పటికి తొమ్మిది సార్లు నేషనల్ అవార్డుకు ఎన్నికైనా, అందులో ఒక్క తెలుగు చిత్రమూ లేకపోవడం!

Show comments