NTV Telugu Site icon

Aadi Saikumar: స్పీడు మీదున్న ఆది సాయికుమార్!

Aadi

Aadi

Aadi Saikumar: ఈ యేడాది ఎక్కువ చిత్రాలలో నటించిన హీరోగా ఆది సాయికుమార్ నిలిచారు. ఈ యేడాది ఇప్పటికే ఆది నటించిన నాలుగు చిత్రాలు విడుదలయ్యాయి. కాగా, డిసెంబర్ 30న ఆది తాజా చిత్రం ‘టాప్ గేర్’ జనంముందు నిలవనుంది. దీంతో ఐదు సినిమాల్లో నటించిన హీరోగా ఆది ఈ సారి పేరు సంపాదించారు. రాబోయే సంవత్సరం కూడా ఓ నాలుగు సినిమాలను అంగీకరించారు. ఇలా బిజీ బిజీగా సాగుతున్న ఆది సాయికుమార్ జయాపజయాలకు అతీతమని చెప్పవచ్చు. ఆది సినిమాలు ఆట్టే అలరించక పోయినా, ఓటీటీల్లో బాగానే ఆకట్టుకుంటున్నాయని సినీజనం అంటున్నారు.

నటుడు సాయికుమార్, సురేఖ దంపతులకు 1989 డిసెంబర్ 23న ఆది జన్మించారు. ఆది పూర్తి పేరు ఆదిత్య పూడిపెద్ది. చెన్నైలోని పద్మా శేషాద్రి స్కూల్ లో ఏడో తరగతి దాకా చదువుకున్న ఆది, తరువాత హైదరాబాద్ “సెయింట్ ఆండ్రూస్ స్కూల్ లోనూ, సెయింట్ జాన్స్ కాలేజ్ లోనూ” చదివారు. భవన్స్ వివేకానంద కాలేజ్ లో చదువుతూ వదిలేశాడు. ఆది చదువుకొనే రోజుల్లో ఆల్ రౌండర్ అనిపించుకున్నారు. క్రికెట్ లో అండర్ 19 టీమ్ లో రంజీకి ఆడారు. 2011లో ‘ప్రేమకావాలి’ సినిమాతో జనం ముందుకు హీరోగా వచ్చారు ఆది. కె.విజయభాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమకావాలి’ మంచి విజయం సాధించింది. తరువాత బి.జయ దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన ‘లవ్లీ’ కూడా మంచి విజయం అందుకుంది. “ప్యార్ మే పడిపోయా” చిత్రంలో “చిన్నపిల్లలు..” సాంగ్ పాడి పాటగాడిగానూ ఆకట్టుకున్నారు ఆది. “గాలిపటం, చుట్టాలబ్బాయ్, శమంతకమణి, నెక్ట్స్ నువ్వే, బుర్రకథ, జోడీ, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, శశి” వంటి చిత్రాలలో ఆది నటన ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఆది సాయికుమార్ ‘జంగిల్’ అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు “అమరన్ ఇన్ ద సిటీ, సి.ఎస్.ఐ. సనాతన్” చిత్రాలలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సారి ఐదు చిత్రాలలో నటించినా, ఆది ఏ సినిమాతోనూ సరైన సక్సెస్ సాధించలేక పోయారు. రాబోయే యేడాది అయినా కోరుకున్న విజయం ఆదిని వరిస్తుందేమో చూడాలి.