Actress Jayasudha Sensational Comments On Tollywood: సీనియర్ నటి జయసుధ తెలుగు చిత్ర పరిశ్రమపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై నుంచి వచ్చే హీరోయిన్లకు మాత్రమే ఇక్కడ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారని, తెలుగు హీరోయిన్లను మాత్రం చిన్నచూపు చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై నుంచి వచ్చే హీరోయిన్లను నెత్తిన పెట్టుకోవడమే కాదు.. వారి కుక్కలకు కూడా ప్రత్యేక ట్రీట్మెంట్లు, స్పెషల్ రూమ్స్ ఇస్తున్నారని కుండబద్దలు కొట్టారు.
తమకు (బీజేపీ) మద్దతుగా మాట్లాడుతోందని కంగనా రనౌత్‌కు పద్మశ్రీ అవార్డ్ ఇచ్చారని, కానీ 50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తనకు పద్మశ్రీ దక్కలేదని వాపోయారు. అదే హీరో అయి..తే ఎక్కడా లేని హడావుడి చేసేవారన్నారు. ఒకవేళ తాను ఇన్నేళ్ల ప్రస్థానాన్ని బాలీవుడ్‌లో పూర్తి చేసుకొని ఉండుంటే.. కనీసం బొకే అయినా పంపించేవారని, ఇక్కడ (టాలీవుడ్) అది కూడా లేదని విమర్శించారు. తాను ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా, ఇతర విషయాల్లో ఇబ్బంది పెట్టినా.. తనని ఇన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో ఉండనిచ్చే వారు కాదని తెలిపారు. తెలుగువారికి ఇక్కడ ఎంతమాత్రం ప్రాధాన్యం ఉండదని చెప్పారు.
అందరు చెప్పుకుంటున్నట్టు సినీ పరిశ్రమలో హీరోల డామినేషన్ ఉండదని.. వారి పక్కన ఉన్న వ్యక్తులతోనే ఇబ్బంది అని జయసుధ బాంబ్ పేల్చారు. ఇదే సమయంలో.. మా అసోసియేషన్ ఎన్నికల సమయంలో జరిగిన గొడవలు భరించలేకే తాను అమెరికా వెళ్లానన్నారు. ఎన్నికలు ముగిశాక తిరిగొచ్చానని వెల్లడించారు. అప్పట్లో శోభన్‌బాబు డబ్బులు పొదుపు చేసుకోమని, స్థలాలు కొనాలని అనేక సార్లు చెప్పారని.. కానీ తాను వినిపించుకోలేదని, సావిత్రిలా తానూ ఎంతో డబ్బు పోగొట్టుకున్నానని జయసుధ చెప్పుకొచ్చారు.
