NTV Telugu Site icon

Legally Veer : లీగల్లీ వీర్ ముఖ్య ఉద్దేశం అదే : హీరో వీర్ రెడ్డి

Legally Veer

Legally Veer

కోర్టు రూము డ్రామా సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులకు ఒకప్పుడు పెద్దగా పరిచయం లేదు. ముందుగా పింక్ ఆ తర్వాత జనగణమన వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చాక ఇలాంటి సినిమాలకు కూడా స్కోప్ పెరిగింది. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటుడిగా మారిన వీర్ రెడ్డి. అరుదైన లీగల్ థ్రిల్లర్ వీర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీర్ రెడ్డి, దయానంద్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘లీగల్లీ వీర్’ సినిమాని రవి గోగుల డైరెక్ట్ చేశారు. సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా డిసెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా హీరో వీర్ రెడ్డి వృత్తిరీత్యా లాయర్, అలాగే ఒక లీగల్ థ్రిల్లర్ సినిమా చేయాలని ఉద్దేశంతో ఈ సినిమా ఆయన స్వయంగా హీరోగా నటించడం గమనార్హం.

ఈ సంద‌ర్భంగా సినిమా గురించి హీరో వీర్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేదన్నారు. క‌రోనా టైమ్‌లో పాడ్ కాస్ట్ చేయాల‌నే ఆలోచ‌న వ‌చ్చి, ప్రయత్నాలు చేస్తున్న స‌మ‌యంలో సినిమా వాళ్ళతో పరిచయం ఏర్పడింది. ఓ మంచి సినిమా చేద్దాం అనుకుని ఈ సినిమా మొదలు పెట్టామని, లీగల్ లాయర్‌ను కాబట్టి నాకు ఈ పాత్ర చేయ‌డం సుల‌భంగా అనిపించింది. అసలు రియల్ కోర్టు డ్రామా ఎలా ఉంటుందో చూపించాలని అనుకున్నామ‌ని చెప్పారు. అంతేకాదు ఈ సినిమా తన తండ్రికి ఇచ్చిన నివాళిగా కూడా వీర్ రెడ్డి పేర్కొన్నారు. తన తండ్రి ఐదేళ్ల క్రితం మరణించారని, తన పేరులో తన తండ్రి పేరులో కామన్ గా ఉన్న వీర్ అనే పదాన్ని తీసుకుని సినిమాకి కూడా అదే టైటిల్ వచ్చేలా ప్లాన్ చేశామని చెప్పుకొచ్చారు. ఢిల్లీ లా స్కూల్లో విద్య అభ్యసించిన అనంతరం తాను అమెరికా వెళ్ళిపోయానని అక్కడ ఇన్ హౌస్ కౌన్సిల్ గా పనిచేస్తూ ఉన్నానని వెల్లడించారు. అయితే తన తండ్రి అనారోగ్యం తనను ఇండియా తీసుకొచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు. 2019లో తన తండ్రి మరణించారని , ఆ తర్వాత 2020లో ఇండియా వచ్చిన తర్వాత కరోనా లాక్ డౌన్ పెట్టడంతో తాను ఇక్కడే ఉండి పోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. తాను ఈ స్థానంలో ఉండడానికి కారణం తన తండ్రేనని ఎందుకంటే ఎక్కడో ఒక పల్లెటూరిలో ఉండి పోవాల్సిన తనను ఢిల్లీలో లా చదివిన తర్వాత అమెరికా వెళ్లి ఉద్యోగం చేసుకునేలా ప్రోత్సహించిన ఆయన కష్టపడి తనను ఈ స్థాయికి తీసుకొచ్చారు అని చెప్పుకొచ్చారు.

ముందుగా పాడ్ క్యాస్ట్ ద్వారా తాను చెప్పాలనుకున్న విషయాలు చెప్పదలుచుకున్నా కానీ ఈ ప్రాసెస్ లో పరిచయమైన కొంతమంది సినీ ప్రముఖుల కారణంగా సినిమా ద్వారా చెబితే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుందని ఈ సినిమాకి శ్రీకారం చుట్టినట్లు వీర్ రెడ్డి వెల్లడించారు. అంతేకాదు ఇండియాలో సరైన లీగల్ థ్రిల్లర్ సినిమాలు లేవని ఒక హాలీవుడ్ స్టైల్ లీగల్ థ్రిల్లర్ సినిమా చేయడానికి అదే విషయం తనకు నాంది పలికిందని అన్నారు. స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు తన తండ్రి విలువలే ప్రతిరోజు జ్ఞప్తికి వచ్చేవని అలాగే తన తండ్రి ఆత్మ ప్రతిరోజు తనను ఇన్స్పైర్ చేస్తున్నట్లు అనిపిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఒక మర్డర్ మిస్టరీ తో పాటు తండ్రి కొడుకుల సెంటిమెంట్ అలాగే ఇండియా వచ్చిన ఒక ఎన్నారై కి ఎదురైన కష్టాలు వంటివి చూపించామని ఆయన పేర్కొన్నారు. మిగతా కోర్టు రూమ్ డ్రామా సినిమాలలో ఉన్నట్లు ఈ సినిమాలో మెలో డ్రామా ఉండదని నిజంగా కోర్టులో ఎలాంటి ప్రొసీజర్స్ ఫాలో అవుతారు? ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవుతారు? అనే విషయాలను కూడా సినిమాలో డిస్కస్ చేశామని ఆయన వెల్లడించారు. కోర్టు మెట్లు ఎక్కకూడదు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కకూడదు అని అనుకునే చాలా మందికి ఇది ఒక మంచి ఉదాహరణగా నిలవబోతోందని ఆయన అన్నారు. కోర్టులో అనుమానితుడు లేదా నిందితుడు అన్నంత మాత్రాన వాళ్లు తప్పు చేసిన వారు కాదని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా సమాజంలో మీరు ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిన వారు అయినా సరే అది న్యాయం , చట్టం కంటే అతీతం కాదు అని చెప్పామని అది సినిమాకు మెయిన్ పాయింట్ అని ఈ సందర్భంగా వీర్ రెడ్డి వెల్లడించారు. అలాగే ఇప్పుడు హీరోల కంటే విలన్లను శక్తివంతంగా చూపిస్తున్న ట్రెండ్ కంటే ఈ సినిమా భిన్నం అంటూ ఆయన పేర్కొన్నారు. ఇక ఈ సినిమా హిందీ వర్షన్ త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతోంది. తెలుగులో ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో వీలైనంత త్వరగా హిందీలో రిలీజ్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు మేకర్స్.

Show comments