నాచురల్ స్టార్ నాని, నజ్రీయా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్ల వేగాన్ని షురూ చేసింది. ఇక తాజాగా నాని ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. తన జీవితంలో ఒక సినిమా చూసి ప్యాంట్ తడిపేసుకున్నట్లు చెప్పి నవ్వులు పూయించాడు.
“చిన్నప్పటి నుంచి నాకు సినిమాలంటే బాగా ఇష్టం.. స్నేహితులతో కలిసి ఎప్పుడు ఏదో ఒక సినిమా చూస్తూనే ఉంటా.. అయితే ఒకరోజు అమ్మ ఎంత చెప్పినా వినకుండా రామ్ గోపాల్ వర్మ తీసిన ‘దెయ్యం’ సినిమాకు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాం. అయితే సినిమా చూస్తున్నంతసేపు చెమటలు పట్టేశాయి. ఒక సన్నివేశంలో హఠాత్తుగా భయపడి నా చేతి లో ఉన్న కూల్ డ్రింక్ ను ప్యాంటు మీద పోసుకున్నాను. దీంతో ప్యాంట్ మొత్తం తడిచిపోయింది. అయితే పక్కనే ఉన్న స్నేహితులు అది చూసి నేను సినిమాకు భయపడి ప్యాంట్ తడిపేసుకున్నాడు అని ఏడిపించారు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
