Aamir Khan: కొత్త జీవితానికి శ్రీకారం చుట్టిన తర్వాత చాలా మంది కొత్త ఇంటిని తమ కొత్త ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ఇప్పుడు అదే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల తన చిరకాల భాగస్వామి గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న ఆయన, ఇప్పుడు కుటుంబం మొత్తం ఒకే చోట నివసించేలా ముంబైలో అత్యంత విలాసవంతమైన నివాసాల్లో ఒకటిని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం రూ.100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మీడియా సమాచారం ప్రకారం, ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన పాలి హిల్‌లో ఉన్న బెల్లా విస్టా, మెరీనా అపార్ట్‌మెంట్ల ను ఆమిర్ ఖాన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన రూ.100 కోట్లకు పైగా వెచ్చించారని, ప్రస్తుతం ఈ రెండు భవనాలను కూల్చివేసి, ఆధునిక హంగులతో ఒక విశాలమైన స్కై విల్లాను రూపొందించాలనే ప్రణాళికలో ఆమిర్ ఉన్నట్లు సమాచారం.
ఈ కొత్త నివాసాన్ని ఖాన్ కుటుంబంలోని పలు తరాల సభ్యులు కలిసి నివసించేలా ప్రత్యేకంగా రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులందరూ ఒకే ప్రాంగణంలో ఉండటంతో పాటు, కుటుంబ సమావేశాలు, వేడుకలు నిర్వహించుకునేందుకు విశాలమైన ప్రదేశాలను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఒక అంతస్తును పూర్తిగా ఫంక్షన్స్ కోసం రూపొందిస్తుండగా, మరో అంతస్తును ఆమిర్ కుమారుడు జునైద్ ఖాన్ కోసం కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆమిర్ ఖాన్ తన భార్య గౌరీ స్ప్రాట్, ఆమె తొలి వివాహం ద్వారా కలిగిన కుమారుడు క్విన్‌తో కలిసి రెండు అంతస్తుల్లో నివసించనున్నట్లు ఒక వార్త అయితే హల్చల్ చేస్తోంది.
ఇదే కాంప్లెక్స్‌లో ఆమిర్ తల్లి జీనత్ హుస్సేన్, సోదరీమణులు నిఖత్ ఖాన్, ఫర్హత్ ఖాన్ దత్తా, అలాగే మాజీ భార్య కిరణ్ రావు, వారి కుమారుడు ఆజాద్ కూడా అపార్ట్‌మెంట్లు కలిగి ఉండనున్నట్లు సమాచారం. అంటే కుటుంబ సభ్యులంతా ఒకే ప్రాంగణంలో ఉండేలా ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ పని పూర్తయ్యే వరకు ఆమిర్ ఖాన్ తాత్కాలికంగా పాలి హిల్‌లోని నర్గీస్ దత్ రోడ్‌లో ఉన్న విల్నోమోనా అపార్ట్‌మెంట్స్‌కు మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడే గౌరీ స్ప్రాట్, పిల్లలు, ఇతర సన్నిహిత కుటుంబ సభ్యులతో కలిసి అమీర్ నివసిస్తున్నట్లు సమాచారం. కొత్త నిర్మాణం పూర్తయిన తర్వాత అందరూ కలిసి ఆ విలాసవంతమైన కొత్త నివాసంలోకి మారనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జూలై 5న ఆమిర్ ఖాన్ తన పాలి హిల్ నివాసంలో గౌరీ స్ప్రాట్‌ను అత్యంత సన్నిహితుల సమక్షంలో రిజిస్ట్రేషన్ విధానంలో వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మాత్రమే హాజరయ్యారు. ఇద్దరి గత సంబంధాల ద్వారా కలిగిన పిల్లలు కూడా ఈ వేడుకలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పుడు వివాహం అనంతరం కుటుంబం కోసం భారీ స్థాయిలో కొత్త నివాసాన్ని నిర్మించాలనే నిర్ణయం తీసుకోవడంతో ఆమిర్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లుగా బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.

