NTV Telugu Site icon

65 ఏళ్ళ ‘శ్రీ గౌరీ మహాత్మ్యం’

(అక్టోబర్ 5తో ‘శ్రీగౌరీ మహాత్మ్యం’కు 65 ఏళ్ళు)

‘శ్రీ గౌరీ మహాత్మ్యం’ చిత్రానికి ‘మంగళగౌరీ వ్రతకథ’ అనే ఉప శిర్షీక కూడా ఉంటుంది. నటరత్న యన్.టి.రామారావు కథానాయకునిగా మహీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. డి.యోగానంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని పి.ఎస్.శేషాచలం నిర్మించారు.

భక్తి రసం తోడయిన జానపద కథ ఇది. భక్తజనాన్ని భలేగా ఆకట్టుకుంది. 1956 అక్టోబర్ 5న ‘శ్రీ గౌరీ మహాత్మ్యం’ జనం ముందు నిలచింది. వారి మనసులు గెలిచింది. 1956లో నవరాత్రుల మొదటి రోజున ఈ సినిమా విడుదల కావడం విశేషం.

‘శ్రీగౌరీ మహాత్మ్యం’ కథ విషయానికి వస్తే- ఒక రాజుకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సత్యవతీదేవి అమ్మవారి భక్తురాలు. రెండో భార్య సత్యభామ. సత్యవతీ దేవికి అమ్మవారి కరుణతో గౌరి జన్మిస్తుంది. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది. సవతి తల్లి, ఆమెను ఎలాగైనా కష్టాల పాలు చేయాలని చూస్తుంది. పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళి చేయాలని నిర్ణయిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పొరుగు దేశపు రాకుమారుడు బాలవీరుడు మారు వేషంలో వచ్చి, గౌరిని పెళ్ళాడతాడు. తరువాత అతను తన నిజరూపం ప్రదర్శిస్తాడు. బాలవీరుడు తండ్రి చేసిన ఓ అకార్యానికి శివుడు శాపం ఇచ్చి ఉంటాడు. ఆ కారణంగా బాలవీరుడు మృత్యువాతకు గురి కావాలి. అయితే తన మంగళగౌరీ వ్రతాన్ని చేసుకొనే గౌరి పసుపుకుంకుమ కాపాడాలని అమ్మవారు ప్రయత్నిస్తారు. శివుడు ఆగ్రహించి, ఓ సర్పాన్ని బాలవీరుని కాటు వేయమని పంపుతాడు. అమ్మవారు సదా రక్షిస్తూ ఉంటుంది. ఓ సారి మాత్రం ఆ పాము కాటుకు గురవుతాడు బాలవీరుడు. దాంతో ఆగ్రహించిన గౌరి, ఆ పాము గొంతు పట్టుకుంటుంది. అప్పుడు పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమై వారిని కరుణిస్తారు. బాలవీరుని ప్రాణాలు దక్కుతాయి. బాలవీరుడు, గౌరిని ఆదిదంపతులు దీవించడంతో కథ సుఖాంతమవుతుంది.

బాలవీరునిగా యన్.టి.రామారావు, గౌరిగా జూనియర్ శ్రీరంజని నటించగా, శివునిగా కాంతారావు, పార్వతిగా లత నటించారు. ఇందులో రేలంగి, ముక్కామల, సీఎస్సార్, వంగర, బాలకృష్ణ, ఎస్.వరలక్ష్మి, సూర్యకాంతం, పి.హేమలత, పుష్పవల్లి, సీత, సూర్యకళ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి ఓగిరాల రామచంద్రరావుతో కలసి టి.వి.రాజు సంగీతం సమకూర్చారు. “వలలోన చిక్కిందిరా…” అనే పాటను కొసరాజు రాయగా, మిగిలిన 15 పాటలను మల్లాది రామకృష్ణశాస్త్రి రాశారు. శృంగారం రాసిన మూలకథకు మల్లాది రచన చేశారు. “శ్రీమించుమా…”, “నీవెక్కడ…”, “భలేభలే గారడీ…”, “నీవు నేనును…” వంటి పాటలు అలరించాయి.

‘శ్రీగౌరీ మహాత్మ్యం’ ఆ రోజుల్లో భక్త కోటిని భలేగా అలరించింది. రిపీట్ రన్స్ లోనూ ఈ సినిమా మంచి వసూళ్ళు చూపింది.