NTV Telugu Site icon

Yama Kinkarudu: చిరంజీవిని మాస్ కు చేరువ చేసిన ‘యమకింకరుడు’

Chiru

Chiru

Yama Kinkarudu: ఇప్పుడంటే మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రాలు బాగా గ్యాప్ తీసుకొని వస్తున్నాయి. కానీ, ఒకప్పుడు చిరంజీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో ఆయన హీరోగా రూపొందిన చిత్రాలు వారానికి ఓ సినిమా కూడా విడుదలయ్యాయి. ఒకే రోజున రెండు సినిమాలూ విడుదలైన సందర్భం ఉంది. అదే తీరున 1982 అక్టోబర్ లో కేవలం మూడు వారాల్లోనే చిరంజీవి నటించిన నాలుగు చిత్రాలు జనం ముందు నిలిచాయి. ఒకే రోజున ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘టింగురంగడు’ విడుదల కాగా, ఆ సినిమాలు వచ్చిన రెండు వారాలకే ‘బిల్లా-రంగా’ విడుదలయింది. ఈ సినిమా వచ్చిన వారానికి ‘యమకింకరుడు’ జనం ముందు నిలచింది. చిరంజీవిని మాస్ కు దగ్గరగా చేసిన చిత్రం ‘యమకింకరుడు’ అనే చెప్పాలి. అంతకు ముందు చిరంజీవితో ‘శుభలేఖ’ చిత్రాన్ని నిర్మించిన అల్లు అరవింద్, ఆ తరువాత ‘గీతా క్రియేటివ్ ఆర్ట్స్’ పతాకంపై ఈ ‘యమకింకరుడు’ సినిమాను నిర్మించారు. 1982 అక్టోబర్ 22న ఈ సినిమా దసరా కానుకగా జనం ముందు నిలచింది.

విజయ్, కిశోర్ సిన్సియర్ పోలీసాఫీసర్స్. మర్డర్స్, మానభంగాలు చేస్తూ సాగుతున్న జాకాల్ గ్యాంగ్ ను వీరిద్దరూ కలసి అరెస్ట్ చేస్తారు. జాకాల్ కు జైలుశిక్ష పడుతుంది. జైలుకు వెళ్తూ తాను వచ్చాక, మీ ఇద్దరి అంతు చూస్తానని అంటాడు జాకాల్. కిశోర్ చెల్లెలు రాధను విజయ్ ప్రేమిస్తాడు. వారిద్దరికీ కిశోర్ పెళ్ళి చేస్తాడు. వారికి ఓ బాబు పుడతాడు. మేనల్లుడితో కిశోర్ భలేగా ఆడుకుంటూ ఉంటాడు. జాకాల్ గ్యాంగ్ జైలు నుండి తప్పించుకుంటుంది. మొదట కిశోర్ ను చంపుతుంది ఆ గ్యాంగ్. తుది క్షణాల్లో మిత్రుడు విజయ్ ఒడిలోనే కిశోర్ ప్రాణాలు విడుస్తాడు. విజయ్ ఆఫీసుకు పోయిన సమయంలో జాకాల్ గ్యాంగ్, అతని ఇంటిపై దాడి చేసి భార్యను, బిడ్డను చంపాలనుకుంటారు. ఆమె తప్పించుకుంటుంది. వెళ్ళి పై పోలీస్ అధికారిని కలుసుకొని, తన భర్తను తనకు దక్కించమని వేడుకుంటుంది. ఎలాగైనా విజయ్ ని ఆయన ఉద్యోగానికి రాజీనామా చేయించమని కోరుతుంది. ఆయన సరే అంటాడు. రాధ భయంతో ఉందని తెలిసి, ఆమె అంకుల్ ఇంటికి తీసుకు వెళతాడు విజయ్. అక్కడ ఆనందంగా ఉంటారు. జాకాల్ అంతు చూడాలని విజయ్ తిరుగుతూ ఉంటాడు. వాడు తన గ్యాంగ్ తో రాధ, బాబు ఉన్న చోటుకు వస్తాడు. బిడ్డను లాక్కుపోతాడు. బాబును రక్షించే క్రమంలో రాధ అంకుల్ ప్రాణాలు కోల్పోతాడు. రాధను గాయపడేలా చేసి, బాబును తీసుకుపోతారు జాకాల్ గ్యాంగ్ వాళ్ళు. వారిని వెదుక్కుంటూ విజయ్ వెళతాడు. జాకాల్ గ్యాంగ్ తో ప్రాణాలకు తెగించి పోరాడతాడు విజయ్. చివరకు కన్నకొడుకును దక్కించుకుంటాడు. జాకాల్ ను రైలుకింద పడేలా చేసి చంపేస్తాడు. బాబుతో ఆసుప్రతిలో ఉన్న భార్య దగ్గరకు విజయ్ చేరుకోవడంతో కథ ముగుస్తుంది.

ఇందులో చిరంజీవి, రాధిక, శరత్ బాబు, జగ్గయ్య, సత్యనారాయణ, ఆర్.ఎస్.సుదర్శన్, టెలిఫోన్ సత్యనారాయణ, ధమ్, జయమాలిని, సిల్క్ స్మిత, ఈశ్వరి నటించారు. హాలీవుడ్ మూవీ ‘డర్టీ హ్యారీ’, ఆస్ట్రేలియన్ సినిమా ‘మ్యాడ్ మ్యాక్స్’ చిత్రాలను కలిపి ఈ కథను రూపొందించారు నిర్మాత అల్లు అరవింద్. ఈ చిత్రానికి బాబూరావు మాటలు రాయగా, ఆరుద్ర, వేటూరి పాటలు పలికించారు. చంద్రశేఖర్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు రాజ్ భరత్ దర్శకత్వం వహించారు. ఇందులోని “తప్పుకో తప్పుకో పోలీసెంకటసామీ..”, “మాట మాట చిన్నమాట..”, “కంటికి నువ్వే దీపం.. కలలకు నువ్వే రూపం..”, “హోయమ్మా హోయమ్మా.. వయ్యారం..” అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ లభించాయి. ఈ చిత్రం కమర్షియల్ సక్సెస్ ను చూసింది. ఈ చిత్రంతోనే చిరంజీవి మాస్ కు మరింత చేరువయ్యారు. ఆ తరువాత ఆయనతో పలు మాస్ మసాలా చిత్రాలు తెరకెక్కాయి.

Show comments