Water Tank Cleaning : వేసవి కాలమైనా, వర్షాకాలమైనా.. ఇంట్లో నిత్యం వాడే నీటి ట్యాంకును (Water Tank) క్రమం తప్పకుండా శుభ్రం చేయడం చాలా అవసరం. చాలా రోజుల పాటు ట్యాంకును పట్టించుకోకపోతే దాని లోపల ఆకుపచ్చ నాచు, బ్యాక్టీరియా , హానికరమైన సూక్ష్మక్రిములు చేరి నీరు పూర్తిగా కలుషితమవుతుంది. చాలా సార్లు ట్యాంక్ నీటి నుండి ఒక రకమైన చేపల వాసన (దుర్వాసన) రావడం మనం గమనిస్తుంటాం. నీటిలో నాచు పేరుకుపోవడం, బ్యాక్టీరియా పెరగడం లేదా పైపులలోని లోహాల రసాయన చర్యల వల్లే ఇలా జరుగుతుంది. మనం రోజువారీ అవసరాలకు, స్నానానికి ఇటువంటి నీటినే వాడితే చర్మ వ్యాధులు, జుట్టు రాలడం వంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సమస్యకు ఇంట్లోనే చేసుకోదగ్గ ఒక సులభమైన, అత్యంత చవకైన శాస్త్రీయ పరిష్కారం ఇప్పుడు చూద్దాం.
ఒక్క పటిక ముక్కతో అద్భుతమైన ఫలితం (కోయాగ్యులేషన్)
నీటిని శుద్ధి చేయడంలో పటిక రాయి (Alum / పొటాషియం అల్యూమినియం సల్ఫేట్) అద్భుతంగా పనిచేస్తుంది. ‘రీసెర్చ్‌గేట్’ అధ్యయనం ప్రకారం.. మురికి నీటిని క్లీన్ చేయడానికి పటిక అనేది చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఒక బెస్ట్ కెమికల్ కోయాగ్యులెంట్ (గడ్డకట్టించే పదార్థం). ఇది నీటిలో కరిగినప్పుడు, అందులో తేలియాడే జిగట మురికి, మట్టి , కంటికి కనిపించని సేంద్రీయ కణాలను ఒకదానికొకటి అతుక్కునేలా చేస్తుంది. శాస్త్రీయంగా దీనిని “కోయాగ్యులేషన్” అంటారు. దీనివల్ల ఆ మురికి కణాలన్నీ బరువెక్కి ‘ఫ్లాక్’ రూపంలో ట్యాంక్ అడుగుభాగానికి చేరుకుంటాయి. ఫలితంగా పైనున్న నీరు స్ఫటికంలా స్వచ్ఛంగా మారుతుంది.
నాచును అడ్డుకుంటుంది.. చర్మానికి మేలు చేస్తుంది
ఎండ తీవ్రత వల్ల ట్యాంక్ గోడలపై ఆకుపచ్చ నాచు (Algae) త్వరగా పేరుకుపోతుంది. ఇది నీటిని పాడు చేయడమే కాకుండా పైప్‌లైన్‌లను కూడా బ్లాక్ చేస్తుంది. పటికను ఉపయోగించడం వల్ల ట్యాంకులో నాచు పెరిగే ప్రక్రియ పూర్తిగా నెమ్మదిస్తుంది. అలాగే గట్టి నీరు లేదా ఉప్పు నీటి వల్ల వచ్చే దురద, దద్దుర్లు, జుట్టు రాలడం వంటి సమస్యలను కూడా ఇది తగ్గిస్తుంది. పటికతో శుద్ధ్దమైన నీటితో స్నానం చేయడం వల్ల చర్మం లోతుగా శుభ్రపడటమే కాకుండా చెమట వాసన కూడా రాదు. అయితే పటిక అనేది కేవలం మురికిని కిందకు చేర్చి, సూక్ష్మజీవులను నిరోధిస్తుంది కానీ బ్యాక్టీరియాను పూర్తిగా 100% నిర్మూలించలేదనే విషయం గుర్తుంచుకోవాలి.
ట్యాంకులో పటికను ఎలా ఉపయోగించాలి?
మొదటి పద్ధతి (మూట కట్టడం): సుమారు 500 లీటర్ల నీటి ట్యాంకుకు 50 నుండి 100 గ్రాముల పటిక ముక్క సరిపోతుంది. ఒక పెద్ద పటిక గడ్డను తీసుకుని, దానిని ఒక తెల్లటి కాటన్ (పత్తి) గుడ్డలో వేసి మూట కట్టాలి. ఈ మూటను ఒక పొడవాటి తాడుకు కట్టి, ట్యాంక్ మధ్యలోకి వెళ్లేలా వేలాడదీయాలి. దీనిని రాత్రంతా నీటిలోనే వదిలేస్తే, ఉదయానికల్లా మలినాలన్నీ ట్యాంక్ అడుగుకు చేరుకుంటాయి.
రెండూ పద్ధతి (పౌడర్ చేయడం): ఒక చిన్న పటిక ముక్కను మెత్తగా నలిపి పౌడర్ లా చేయాలి. మొదట ట్యాంకును పూర్తిగా ఖాళీ చేసి బేసిక్ క్లీనింగ్ చేశాక, మళ్లీ కొత్త నీటిని నింపేటప్పుడు ఈ పటిక పొడిని అందులో కలపాలి. కొద్ది సమయంలోనే అది నీటిలో కరిగిపోయి తన పనిని ప్రారంభిస్తుంది.
గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు:
కేవలం పటిక వేసి వదిలేయడం మాత్రమే సరిపోదు. ట్యాంక్ అడుగున పేరుకుపోయిన మురికిని ప్రతి 2 నుండి 3 నెలలకు ఒకసారి బ్రష్ లేదా వ్యాక్యూమ్ పైపుతో క్లీన్ చేస్తూ ఉండాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ట్యాంక్ లోపలికి బయట నుండి దుమ్ము, ధూళి చేరకుండా మూతను ఎల్లప్పుడూ టైట్‌గా మూసి ఉంచాలి. నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకుండా క్రమం తప్పకుండా మారుస్తూ ఉండాలి. ఒకవేళ ట్యాంక్ నుండి తీవ్రమైన దుర్వాసన వస్తుంటే, మొదట దాన్ని పూర్తిగా ఖాళీ చేసి బ్లీచింగ్ లేదా క్లోరినేషన్ సాయంతో క్షుణ్ణంగా కడిగిన తర్వాతే ఇలాంటి పద్ధతులను పాటించడం వల్ల బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి.
