Natural Home Cooling Tips: ఎండలు దంచి కొడుతున్నాయి.. పగలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఉండగా.. ఇక, సాయంత్రం అయ్యిందంటే చాలు.. ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంటుంది.. ఉదయం నుంచే మండే ఎండలు, వడగాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో కూడా వేడి ఎక్కువైపోవడంతో చాలామంది ఎయిర్ కండిషనర్లు, కూలర్లపై ఆధారపడుతున్నారు. అయితే ఇకపై ఖరీదైన ఏసీల అవసరం లేకుండానే మీ ఇంటిని సహజంగా చల్లగా ఉంచే ఓ ప్రాచీన భారతీయ పద్ధతి మళ్లీ ప్రాచుర్యంలోకి వస్తోంది. అది టెర్రకోట కూలింగ్ టెక్నాలజీ. సుమారు 3000 ఏళ్ల నాటి ఈ పద్ధతి సింధు లోయ నాగరికత కాలం నుంచే ఉపయోగంలో ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. మట్టి కుండల సహాయంతో ఇళ్లలో ఉష్ణోగ్రతను తగ్గించే ఈ పద్ధతి ఇప్పుడు ఆధునిక గృహాల్లో కూడా ఉపయోగిస్తున్నారు.
టెర్రకోట అంటే ఏమిటి?
టెర్రకోట అనేది సహజమైన బంకమట్టితో తయారు చేసే మట్టిపాత్ర. ఈ మట్టిని అచ్చులో వేసి తక్కువ ఉష్ణోగ్రత వద్ద కాల్చి గట్టిపరుస్తారు. దీనిలో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఇవి తేమను పీల్చుకుని నెమ్మదిగా విడుదల చేస్తాయి. అందుకే మట్టి కుండలో నీరు వేసవిలో చల్లగా ఉంటుంది. టెర్రకోటకు సాధారణంగా ఎరుపు లేదా గోధుమ రంగు ఉంటుంది. మట్టిలో ఉండే ఇనుము కారణంగా ఈ రంగు వస్తుంది.
టెర్రకోట కూలింగ్ ఎలా పనిచేస్తుంది?
వేసవిలో ఇంట్లోకి వచ్చే వేడిలో ఎక్కువ భాగం పైకప్పు నుంచే వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ఇంటి పైకప్పు నిర్మాణ సమయంలో కాంక్రీట్ స్లాబ్ మధ్య ఖాళీ మట్టి కుండలను తలకిందులుగా అమర్చుతారు. ఇలా అమర్చిన కుండలు పైకప్పులో గాలి ఖాళీలు సృష్టిస్తాయి. ఇవి ఇన్సులేషన్‌లా పనిచేసి, సూర్యుడి వేడి నేరుగా గదుల్లోకి రాకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా ఇంటి లోపల ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గుతుంది.
చెమటలాగే పనిచేసే సహజ విధానం
టెర్రకోట మట్టిలోని రంధ్రాలు తేమను పీల్చుకుంటాయి. ఆ తేమ నెమ్మదిగా ఆవిరైపోతున్నప్పుడు చుట్టూ ఉన్న వేడిని గ్రహిస్తుంది. ఇది మన శరీరం చెమట పట్టి చల్లబడే విధానంతో సమానం. అందుకే దీనిని సహజ శీతలీకరణ విధానం అంటారు. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ పద్ధతి ఇంటి లోపలి వేడిని 50 శాతం వరకు తగ్గించగలదు. ముఖ్యంగా తీవ్రమైన ఎండల సమయంలో ఇది ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.
మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఆప్షన్
ఏసీలు, కూలర్లు వాడితే భారీ విద్యుత్ బిల్లులు వస్తాయి. కానీ, టెర్రకోట కూలింగ్‌కు కరెంట్ అవసరం లేదు. నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువ. అందుకే ఇది మధ్యతరగతి కుటుంబాలకు మంచి ప్రత్యామ్నాయం. ఇక, ఎయిర్ కండిషనర్లు బయట గాలిని మరింత వేడిగా మార్చే అవకాశం ఉంటుంది. కానీ టెర్రకోట పద్ధతిలో కార్బన్ ఉద్గారాలు ఉండవు. దీంతో పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
మళ్లీ పాత పద్ధతుల వైపు అడుగులు
ఆధునిక యంత్రాలు లేకపోయినా మన పూర్వీకులు ప్రకృతితో ఎలా సామరస్యంగా జీవించారో ఈ టెక్నాలజీ చూపిస్తోంది. నేటి కాలంలో విద్యుత్ ఆదా చేయాలంటే, గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలంటే ఇలాంటి సహజ పద్ధతులను పెద్ద ఎత్తున ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇకపై మీ ఇల్లు ఫ్రిజ్‌లా కూల్‌గా ఉండాలంటే, ఈ 3000 ఏళ్ల నాటి భారతీయ చిట్కాను ఒకసారి ఆలోచించాల్సిందే మరి..
